భారత-రష్యా దేశాలను సైబీరియా పక్షులే కలిపాయని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఉదాహరణకు ప్రతి డిసెంబరులో సైబీరియా పక్షులు ఎంతో దూరం నుంచి మా గుజరాత్ రాష్ట్రానికి వస్తాయని, అంటే ప్రకృతి మన దేశాలను ఇలా కలిపిందని పేర్కొన్నారు. ఇది ఓ టూరిస్టు డెస్టినేషన్ అని అభివర్ణించారు. భారతీయులు కూడా రష్యాలోని సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని. ఇక్కడి సంస్కృతిలో మమేకమవుతుంటారని ఆయన చెప్పారు. రెండు రోజుల పర్యటనకు గాను ఆయన బుధవారం రష్యాకు చేరుకున్నారు. ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరయ్యేందుకు వ్లాదివోస్తోక్ కు చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ… సైనిక పరికరాలను తక్కువ ధరలకు ఉత్పత్తి చేయడానికి ఇండియా పూనుకొన్నదని తెలిపారు. భారత్ తో బాటు రష్యా కూడా ఇందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇండియాలో అతి తక్కువ ధరలకు ఈ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని ఇవే ధరలకు తృతీయ ప్రపంచ దేశాలకు అమ్మాల్సి ఉంది. ఈ అవకాశాన్ని రెండు దేశాలూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వ్లాదివొస్తోవ్ లో జరిగే 5 వ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో బాటు 20 వ ఇండియా-రష్యా వార్షిక సమావేశంలో కూడా మోదీ పుతిన్ తో బాటు పాల్గొననున్నారు. కాగా-ఈ పర్యటనలో మోదీ.. భారత-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉద్దేశించిన వివిధ ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
అటు- జ్వేజ్దా షిప్ బిల్డింగ్ చేరుకునేందుకు ఉభయ నేతలూ షిప్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఉగ్రవాదం ఏరివేతకు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.