తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఛార్జిషీటు సిద్ధమైంది. మొత్తం 23 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ముగ్గురు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అంతేకాదు జయరామ్ హత్యకు సంబంధించి మరిన్ని సంచలన నిజాలు బయటికి వచ్చాయి.
నిందితులు వీరే..
ఈ కేసులో రాకేష్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్న పోలీసులు, విశాల్‌ను ఏ2, శ్రీనివాస్ (వాచ్ మాన్)ను ఏ3, నగేష్ (రౌడీషీటర్)ను ఏ4, సూర్య ప్రసాద్ (కమెడియన్)ను ఏ5, కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు)ను ఏ6, సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)ను ఏ7, బిఎన్ రెడ్డి (టీడీపీ నాయకుడు)ను ఏ8, అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)ను ఏ9, శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్)ను ఏ10, రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్)ను ఏ11, మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసిపి)ను ఏ 12గా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో మొత్తం 73మందిని సాక్షులుగా పోలీసులు విచారించారు. వారిలో జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ సంతోష్ రావ్‌గా 13వ సాక్షిగా పేర్కొన్నారు.
ఎలా మొదలైందంటే..
టెట్రాన్ కంపెనీ వివాదం పరిష్కరిస్తానని జయరాంకు రాకేష్ రెడ్డి పరిచయం అయ్యాడు. అదే సమయంలో అతడి మేనకోడలు శిఖా చౌదరితో రాకేష్ రెడ్డికి పరిచయం అయింది. వారిద్దరు కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో శిఖాను పెళ్లి చేసుకోవాలనుకొని రాకేష్ రెడ్డి అనుకున్నాడు. అయితే ప్రతిసారి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిన శిఖా.. ఆ తరువాత సాగర్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై రాకేష్ రెడ్డి, శిఖాను నిలదీశాడు. దీంతో రాకేష్‌పై ఆమె చెడు ప్రచారం చేసింది. ఈ పరిణామంతో ఆగ్రహంతో రగిలిపోయిన రాకేష్ రెడ్డి.. శిఖా కోసం ఖర్చు పెట్టిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో శిఖా ఆమె బీఎమ్‌డబ్ల్యూ కారు తీసుకెళ్లాలని కూడా చేశాడు. అయితే ఈ విషయం జయరాం వద్దకు వెళ్లడంతో.. శిఖా ఇవ్వాల్సిన మొత్తం డబ్బును తాను ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ తరువాత రాకేష్ రెడ్డి ఫోన్‌లకు జయరాం సమాధానం ఇవ్వలేదు. దీంతో కోపాద్రిక్తుడైన రాకేష్ రెడ్డి.. జయరాంను కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశాడు.
ఒకసారి విఫలమైన జయరాం కిడ్నాప్ ప్రయత్నం..
జయరాంను ఎలాగైనా కిడ్నాప్ చేయాలనుకున్న రాకేష్ రెడ్డి అతడి రాకపోకలపై సమాచారం ఇవ్వాలని శిఖా చౌదరి వాచ్‌మెన్‌కు డబ్బులిచ్చాడు. ఈ క్రమంలో జనవరి 29న శిఖా చౌదరి ఇంటి వద్ద నుంచి జయరాం కిడ్నాప్‌కు రాకేష్ రెడ్డి ప్రయత్నించాడు. అయితే తృటిలో ఈ కిడ్నాప్ నుంచి తప్పించుకున్నాడు జయరాం. దీంతో రాయదుర్గం సిఐ రాంబాబును కలిసిన రాకేష్ రెడ్డి మరోసారి జయరాం హత్య కోసం ప్లాన్ చేసుకున్నాడు.
హత్య జరిగిందిలా..
వీణ అనే పేరుతో జయరాంను హనీ ట్రాప్ చేసిన రాకేష్.. లంచ్‌కు కలుద్దాం అంటూ మెసేజ్ పెట్టాడు. ఆ తరువాత వీణ డ్రైవర్లమంటూ జయరాం ఇంటికెళ్లిన కమెడియన్ సూర్య ప్రసాద్, కిషోర్‌లు హోటల్‌లు తీసుకొచ్చారు. జయరాం రూమ్‌కు రాగానే.. సెల్‌ఫోన్లు లాగేసుకున్న రాకేష్.. డబ్బులిస్తేనే వదిలి పెడతానని తెలిపాడు. దీంతో డబ్బుల కోసం పలువురికి ఫోన్లు చేశాడు జయరాం. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు ఈశ్వరరావు రూ.6 లక్షలు సర్దుబాటు చేసి.. దస్ పల్లా హోటల్ లో రాకేష్ అనుచరుడికి ఇచ్చాడు. అయితే అప్పటికప్పుడు తనకు 50 లక్షలు కావల్సిందేనన్న రాకేష్ రెడ్డి.. జయరాంపై దాడి చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో 4.5కోట్లు జయరాంకు అప్ప ఇచ్చినట్లు రాయించుకున్నాడు రాకేష్ రెడ్డి. ఆ సమయంలో టీడీపీ నేత బిఎన్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఇక రాకేష్ దెబ్బలకు కూలబడ్డ జయరాం.. ఛాతిలో నోప్పిగా ఉందని హాస్పటల్ కు తీసుకు వెళ్లాలని కోరాడు. అయితే సంతకాల తరువాత జయరాంను హత్య చేయమని నగేష్‌కు చెప్పాడు. కానీ హత్య చేసేందుకు నగేష్ విముఖత చూపడంతో.. అతడి బంధువు విశాల్ సాయంతో జయరాంను హత్య చేశాడు రాకేష్. ఈ విషయాన్ని రాయదుర్గం మాజీ సిఐ రాంబాబుకు ఫోన్‌లో చెప్పాడు రాకేష్. ఆ తరువాత కారులో మృతదేహాన్ని తీసుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. మాజీ సిఐ శ్రీనివాసులుతో కలిసి మాట్లాడాడు. పోలీసుల సలహాలతో మృతదేహాన్ని నందిగామకు తరలించి యాక్సిడెంట్ జరిగినట్లు సృష్టించాడు. ఇదిలా ఉంటే జయరాంను రాకేష్ చిత్ర హింసలు చేసే సమయంలో అక్కడే ఉన్న నిందితులు 11 వీడియోలు, 13 ఫొటోలను తీశారు. వీటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జయరాం శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. అయితే ఈ ఏడాది జనవరి 30న ఇంటి నుంచి వెళ్లిన జయరాం.. 31న నందిగామాలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.