ఆర్థిక నేరాల ఆరోపణలో భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్తలలో తరచుగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ చోక్సీ పేర్లు మాత్రమే మనకు వినిపిస్తుంటాయి. అయితే ఈ లిస్ట్‌లో వీరే కాదు మొత్తం 36మంది ఉన్నారట. పలు కుంభకోణాల్లో నిందితులైన వీరందరూ ఇటీవల కాలంలోనే దేశం విడిచి పారిపోయారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వెల్లడించింది.
ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలీకాఫ్టర్ల కుంభకోణం కేసు విచారణ సందర్భంగా ఈ వివరాలు వెల్లడించింది ఈడీ. ఈ కేసులో అరెస్టైన సుషేన్ మోహన్ గుప్తా తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే సుషేన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది సంవేద్నా వర్మ కోర్టుకు తెలిపారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను మార్చగలడని, దేశం విడిచి పారిపోగలడని వర్మ వెల్లడించారు. అతడిలా ఆర్ధిక నేరాలకు పాల్పడిన 36మంది వ్యాపారవేత్తలు ఇదే పనిచేశారని వర్మ పేర్కొన్నారు.