యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌కు సలహా ఇచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. దేశ ఆర్ధిక విషయాల్లో ఆయనకు కనీస పరిఙ్ఞానం లేదని ఆయన మరోసారి నిరూపించుకున్నారంటూ విమర్శించారు. భారత ఆర్ధిక వ్యవస్థపై యోగీకి ఏమీ తెలియదని.. ఆయన పూర్తిగా అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థను ఒకనాటి మొగలులు, బ్రిటీషు వారు బలహీన పరిచారని యూపీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అసద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యోగికి ఆర్ధిక పరమైన విషయాలు తెలియకపోతే నిపుణలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏమి చేసిందో చెప్పాలని అసదుద్దీన్ ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, కరువు, జీడీపీ 5 శాతం వంటి విషయాలపై సీఎం యోగి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్.
ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకానమీ ఫోరం సమావేశంలో సీఎం యోగీ మాట్లాడుతూ..మన దేశాన్నిపాలించిన మొఘలులు, బ్రిటీషర్లు రాకముందుకు ప్రపంచంలోనే మన ఆర్ధిక వ్యవస్థ ఎంతో బలంగా ఉండేదని, వీరంతా మన దేశానికి వచ్చిన తర్వాతే బలహీనపడిందన్నారు. స్వాతంత్రం సమయంలో బ్రిటీషు వారు మన దేశాన్ని వదిలి వెళ్లే సమయంలో మనకు ఆర్ధిక వ్యవస్థ నీడ మాత్రమే మిగిలిందంటు చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో మూడింట ఒక వంతుకు పైగా మన వ్యవస్థ బలంగా ఉండేదన్నారు యోగీ ఆదిత్యానాథ్.