వెరైటీ నిరసన, మీరొస్తే పూలమాలలు కావు, చెప్పులు, బూట్లతోనే స్వాగతం, బీజేపీ, మిత్ర పక్షాలకు ఓ గ్రామం వార్నింగ్

హర్యానాలో బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ నాయకులు మా గ్రామంలోకి వస్తే పూలదండలతో కాదు, చెప్పులు, బూట్లతో స్వాగతమిస్తాం అంటున్నారు ఈ రాష్ట్రంలోని ఓ గ్రామస్థులు.

వెరైటీ నిరసన, మీరొస్తే పూలమాలలు కావు, చెప్పులు, బూట్లతోనే స్వాగతం, బీజేపీ, మిత్ర పక్షాలకు ఓ గ్రామం వార్నింగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 28, 2020 | 8:47 PM

హర్యానాలో బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ నాయకులు మా గ్రామంలోకి వస్తే పూలదండలతో కాదు, చెప్పులు, బూట్లతో స్వాగతమిస్తాం అంటున్నారు ఈ రాష్ట్రంలోని ఓ గ్రామస్థులు. కర్నాల్ జిల్లాలోని ఖదీరాబాద్ గ్రామవాసుల వినూత్న నిరసన ఇది ! రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, ఇవి రైతు వ్యతిరేకమని వారు మండిపడుతున్నారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా (జననాయక్ జనతా పార్టీ నేత) తో బాటు బీజేపీ, దాని మిత్ర పక్షాలను తాము బాయ్ కాట్ చేస్తున్నామని వీరు ప్రకటించారు. ఈ  మేరకు ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ప్రవేశ మార్గం వద్ద ఇలా ఓ బ్యానర్ కూడా ఈ గ్రామస్థులు ఏర్పాటు చేశారు.. మా రైతుల పక్షాన మాట్లాడేవారిని మాత్రమే అనుమతిస్తాం అని ఆ బ్యానర్ పై స్పష్టం చేశారు కూడా. అధికారంలో ఉన్నవారు రైతులను టెర్రరిస్టులని, తీవ్రవాదులని, ఖలిస్తానీయులని ఇలా అవమానిస్తున్నారని, రైతుల్లో చీలికలు తేవడానికి యత్నిస్తున్నారని ఖదీరాబాద్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

నిరసన చేస్తున్న రైతుల్లో చీలికలు తెచ్చేందుకు సట్లెజ్-యమునా నదీ జలాల సమస్యను హర్యానా ప్రభుత్వం తెస్తోందని గుర్లాల్ సింగ్ అనే అన్నదాత దుయ్యబట్టాడు. మా పొరుగునున్న ఇతర గ్రామస్థులు  కూడా మా లాగే బీజేపీ, జేజేపీ నేతలను బాయ్ కాట్ చేయాలనీ కోరుతున్నాం అని తెలిపాడు.   జింద్ జిల్లాలో దుశ్యంత్ చౌతాలా స్వగ్రామమైన ‘ఉచనా కలన్’ తో బాటు పలు గ్రామ పంచాయితీలు ఈ విధమైన పిలుపులను ఇవ్వడం విశేషం. చౌతాలా నిన్న మొన్నటివరకు రైతులకు కనీస మద్దతుధర ఇవ్వకపోతే బీజేపీకి దూరమవుతామని హెచ్చరించినప్పటికీ …..తాజాగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కారానికి చట్ట సవరణ చేస్తే చాలునని అన్నదాతలు కోరాలని సూచిస్తున్నారు. ఇక ఈయనతో బాటు సీఎం కాన్వాయ్ లను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు, వారు తమ గ్రామాల్లోకి రాకుండా లోతైన గోతులను తవ్వుతున్నారు.