పెరుగుతున్న పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి మరియు వినియోగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహార రంగాలు అందిపుచ్చుకోవాలని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ అవసరాల మేరకు ఆధునిక సాంకేతిక సాయంతో మరో విప్లవం సృష్టించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్‌కు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 2030 నాటికి ఆహార కొరతలేని సుస్థిర అభివృద్ధి జరగాలంటే వ్యవసాయ రంగంలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తగ్గిపోతున్న వనరులను.. భూమి, నీటిని దృష్టిలో ఉంచుకుని ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, ఆహార రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగం అందిపుచ్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ఆర్థికస్థితి, సహజవనరుల యాజమాన్యాన్ని సంపూర్ణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.