COVID-19 vaccine Beneficiaries : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ చురుకుగా కొనసాగుతోంది… ముందుగా కరోనా వారియర్స్‌కు వ్యాక్సినేషన్ జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. భారత్‌లో వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన వారం రోజుల్లోనే 10లక్షలకు పైగా మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ రాష్ట్రం నాలుగో ఫ్లేస్‌లో కొనసాగుతుంది.
ఇక, ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసిన మొదటి ఐదు రాష్ట్రాలను పరిశీలిస్తే.. కర్ణాటకలో ఇప్పటివరకు 1,38,807 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో 1,15,365 మందికి, ఒడిశాలో 1,13,623 మందికి, తెలంగాణలో 97,087 మందికి, బీహార్ రాష్ట్రంలో 63,541 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించారు.
ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా సెషన్లు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నిని మీడియాకు తెలిపారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 4,049 సెషన్లలో 2,37,050 మందికి టీకాలు వేశామని తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 18,167 సెషన్‌లు నిర్వహించగా, వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్య 10,43, 534 మందికి చేరిందన్నారు.
ఇక, ఇవాళ వ్యాక్సిన్ మూలంగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన వెల్లడించారు. కాగా, కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు రెండు వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే.. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌తో పలువురు అస్వస్థతకు గురైనా.. తిరిగి పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడొద్దని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలావుంటే దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ రోజు 14,545 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం సంఖ్య 1.06 కోట్ల కేసులుగా ఉంది.