రాష్ట్రంలో చేనేత రంగంలోని ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషీ చేస్తున్నామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. నేతన్న చేయూత పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు. 13 జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో అవార్డుల ప్రదానం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, చేనేత కార్మికులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది చేనేత రంగంపై ఉపాధి పొందుతున్నారన్న మంత్రి.. గత మూడేళ్లుగా పెద్ద మొత్తంగా చేనేతకు బడ్జెట్ కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు కూడా ఇస్తున్నామని తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, నాలుగు నెలలు ముందుగానే రూ. 96.43 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 20,554 మంది నేతన్నలు చేనేత మిత్రలో పేరు నమోదు చేసుకున్నారని.. దీని ద్వారా నూలు, రసాయనాలపై 50 శాతం రాయితీపై అందిస్తున్నామన్నారు. గతంలో నేతన్నల రుణాలను రద్దు చేశామని గుర్తు చేసిన మంత్రి.. ఎనిమిది బ్లాక్ లెవల్ క్లస్టర్లు అమలు చేస్తున్నామన్నారు. కొత్త బ్లాక్ లెవల్ క్లస్టర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
IT & Industries Minister @KTRTRS virtually interacted with the weavers and also presented the Konda Laxman Bapuji Awards 2020 to them at #NationalHandloomDay Virtual Celebrations at Pragathi Bhavan. pic.twitter.com/vWDnw0B3LD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 7, 2020
ఇకపై ప్రతి సోమవారాన్ని చేనేత సోమవారంగా పాటిస్తున్నామని.. చేనేత సోమవారాన్ని పాటిస్తున్న అధికారులు, నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక్కరోజు చేనేత దుస్తులను ధరించి నేతన్నకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. నేతన్నల కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం చేసుకున్నామని.. రసాయనాల వినియోగం తగ్గింపుపై ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇక, మహిళా చేనేత కార్మికులకు చేయూతనందించడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్.. చేనేత లోగో పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోటీలో నెగ్గిన వారికి చేనేత, టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అవార్డు ప్రదానం చేస్తామన్నారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు http://handloomday.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.