క్రీడాభిమానుల్లో ఇప్పుడు ధోని రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ధోని ఇంకా ఏ మాటను చెప్పనప్పటికీ.. ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ ఆలోచనను ధోని విరమించుకోవాలని సెలబ్రిటీలు సహా పలువురు అభిమానులు ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతుంటే.. మరోవైపు ఆయన రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి రాజకీయ పార్టీలు. ధోని క్రేజ్‌ను పొలిటికల్‌గా వాడుకోవాలనుకుంటున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అనంతరం ధోని బీజేపీలో చేరుతాడని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాన్వాన్ వెల్లడించారు.
‘‘ధోని నా స్నేహితుడు. క్రికెట్‌లో ప్రపంచ దిగ్గజాలలో ఆయన ఒకరు. ఆయనను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. రిటైర్మెంట్ తరువాత ఆయన దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని పాస్వాన్ వెల్లడించారు. కాగా ఝార్ఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నడుస్తుండగా.. దానిపై అక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పలు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో ధోని క్రేజ్‌ను పొలిటికల్‌గా వాడుకోవాలనుకుంటోన్న అక్కడి నాయకులు.. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ ధోని బీజేపీలో చేరితో త్వరలో ఆ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. కాగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సైతం ఆ మధ్యన బీజేపీలో చేరి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.