తిరుమలలో లక్ష మంది స్థానికులకు తొలిసారి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి బోర్డు కల్పించడం సంతోషకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కోవిడ్ తో భక్తుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా స్థానికులకు ఈ అవకాశం దక్కిందని అన్నారు. “టీటీడీ పాలకమండలి పెద్ద మనసుతో స్థానికులకు అవకాశం కల్పించింది.. ఈ ఏడాది నుంచి వైకుంఠ ద్వారం పదిరోజులపాటు తెరిచి ఉంటుంది. స్థానికులు, స్థానికేతరులు అందరూ స్వామివారి భక్తులే. తిరుపతి వాసుల్లో ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తమైంది. నేను సామాన్య భక్తుడినే. అందరితో కలిసి సర్వదర్శనం పొందడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సామాన్యుడిగానే స్వామి దర్శనం సర్వ దర్శనం టోకెన్ తో చేసుకుంటాను. అరక్షణం స్వామి వారి దర్శన భాగ్యము దక్కితే చాలు. అహంకారంతో స్వామివారి దర్శనానికి వెళితే స్వామివారి కృప, కరుణ దక్కదు” అని భూమన చెప్పారు. తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సర్వదర్శనం టోకెన్ తీసుకున్న ఎమ్మెల్యే భూమన, అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.