హైదరాబాద్‌లో కనివిని ఎరుగని రీతిలో కుండపోత వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. భారీ వర్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభ్యుల విజ్ఞప్తి మేరకు నగరంలో వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న సహాయ చర్యలను మంత్రి వివరించారు. ఆకాశం చిల్లులు పడుతుందా అన్నట్లుగా హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి నుంచి ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు నైట్ షెల్టర్స్‌లో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు.
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జోన్ల వారీగా నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తడంతో.. నీటికి దిగువకు విడుదల చేశామని చెప్పారు. భవన నిర్మాణ పనులను ఆపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ముసారాంబాగ్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నామని చెప్పారు. నగర వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహాయకలు చర్యటు చేపట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.