GHMC Election Results 2020 : 44 గెలిచాం, బీజేపీ మరింత ఎదగకుండా కృషి చేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

|

Dec 05, 2020 | 3:16 AM

గ్రేటర్ ఎన్నికల్లో 51 స్థానాలకు పోటీ చేస్తే 44 స్థానాల్లో గెలుపొందామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పోలింగ్ శాతం మరింత పెరిగితే బాగుండేదని...

GHMC Election Results 2020 : 44 గెలిచాం, బీజేపీ మరింత ఎదగకుండా కృషి చేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
Follow us on

గ్రేటర్ ఎన్నికల్లో 51 స్థానాలకు పోటీ చేస్తే 44 స్థానాల్లో గెలుపొందామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పోలింగ్ శాతం మరింత పెరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారాయన. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలిచాం.. ఈ సారి 51 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలుపొందామని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడైన అనంతరం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు.

హైదరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో ఉన్న 44 డివిజన్లలో 34 వార్డుల్లో పోటీ చేసి 33 గెలిచామని.. పురానాపూల్ నుంచి నాలుగోసారి గెలుపొందామని చెప్పారు. ఇది మా పనితనానికి నిదర్శనమని ఆయన అన్నారు.” బీజేపీ కూడా ఈసారి చాలా స్థానాల్లో గెలిచింది.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత ఎదగకుండా కృషి చేస్తాం. బీజేపీకి లభించింది తాత్కాలిక విజయమే.” అని అసద్ చెప్పుకొచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి విషయంపై గెలుపొందిన కార్పొరేటర్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నష్టపోయింది నిజమేనని.. రాజకీయ ఉద్దండుడు కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని అసదుద్దీన్‌ చెప్పారు. కాగా, ఎన్నికల్లో విజయం అనంతరం ఓవైసీ ఇంటికి భారీగా చేరుకున్న ఎంఐఎం కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.