మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు తమ విమర్శల వాడిని పెంచుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య మెనిఫెస్ట్ వార్ నడుస్తోంది. వీరసావర్కర్ పేరు భారత రత్నకు సిఫార్సు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు.. తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్‌కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఎంఐఎం, కాంగ్రెస్, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత నోట వెలువడిన మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ “సావర్కర్-భారతరత్న” అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ సావర్కర్‌కు ఇస్తామనడమే కాదు.. రేపు గాంధీని హత్య చేసిన గాడ్సేకు కూడా ఇస్తామంటారంటూ విమర్శించారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా సావర్కర్ భారత రత్న అంశంపై మండిపడ్డారు. సావర్కర్‌కు భారతరత్న ప్రతిపాదనపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీ హత్య కేసులో సావర్కర్ నిందితుడనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, సాక్ష్యాలు లేకనే ఆయనను విడిచిపెట్టారని కాంగ్రెస్‌కు చెందిన ఓ మైనార్టీ నేత ఆరోపించారు. ఇవాళ సావర్కర్‌కు భారతరత్న ఇస్తామంటున్న వారు.. రేపటినాడు గాడ్సే పేరు కూడా ప్రతిపాదిస్తారనే భయం కలుగుతోందని అభిప్రాయపడ్డారు.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్ సభలో పాల్గొన్న ఓవైసీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సావర్కర్‌కు భారత రత్న ప్రతిపాదనపై మండిపడ్డ ఆయన.. మీకు నిజంగా భారతరత్న ఇవ్వాలని అనుకుంటే.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారత రత్న ఇవ్వాలని కోరారు.