
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మన దేశంలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తోంది. అయితే, కరోనా వైరస్ అటు ఆటగాళ్లల్లో టీమ్ సభ్యుల్లో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లో ఆడే పలువురు క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ టీమ్ మెంబర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కొంత గందరగోళం నెలకొంది.
ఐపీఎల్ 13వ సీజన్ సకాలంలో మొదలవుతుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం భారత్ నుంచి యూఏఈ బయలుదేరాల్సిన స్టార్ ప్రొడక్షన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ యూఏఈ ప్రయాణాలను రద్దు చేసుకున్నది. యూఏఈ వెళ్లడానికి సిద్ధమైన మొదటి బ్యాచ్‌లో స్టార్ ఉద్యోగికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. దీంతో మిగతా ప్రొడక్షన్ టీమ్ సభ్యులందరి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు వెలువడిన తర్వాతనే యూఏఈకి సిబ్బందిని పంపించాలని స్టార్ స్పోర్ట్స్ సంస్థ భావిస్తున్నది.సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభంకావాల్సి ఉండగా ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.