Breaking News : తెలంగాణలో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి

|

Sep 03, 2020 | 11:09 AM

భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవలగూడెంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. ఇంకా అడవిలో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించగా, మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు.

Breaking News : తెలంగాణలో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి
Follow us on

అడవుల్లో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవలగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా అడవిలో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించగా, మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా, తప్పించుకున్న మిగతా మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు దగ్గరి నుంచి ఓ వెపన్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న మావోయిస్టులు ఈ మధ్య మళ్లీ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మావోయిస్టులపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.

మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి, మల్లోజులతో పాటు పార్టీలో చేరిన కటకం సుదర్శన్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గణపతి సహచరి సుజాత, మల్లోజుల సహజరి తారాబాయి కూడా అడవులను వీడనున్నట్లు తెలిసింది. సెంట్రల్ కమిటీ సభ్యులైన మల్ల రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి అలియాస్ దేవజీ, కడారి సత్యనారాయణ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు పార్టీని వీడి జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారని, తమ లొంగుబాట్ల కోసం కుటుంబసభ్యులు, సన్నిహితుల సాయంతో పోలీసులు, రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు డీజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఏరియల్ సర్వే చేశారు. అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లొంగుబాట్లు, కదలికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మావోయిస్టు ప్రభావిత జిల్లాలో పర్యటించిన డీజీపీ మరోసారి పర్యటనలు చేపట్టడం విశేషం.