ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు గ్లెన్ బ్రిగ్స్ అనే కరడుగట్టిన నేరస్థున్ని అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు.. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్టిఫికెట్ అయిన సృష్టించడంలో గ్లెన్ బ్రిగ్స్ దిట్ట అని పలువురు చెప్పుకుంటుంటారు. పోలీస్ సైరన్ ఉన్న వాహనాన్ని వినియోగిస్తూ.. పోలీస్ ఐడీ కార్డుతో యధేచ్చగా అక్రమాలు సాగిస్తున్న గ్లెన్ బ్రిగ్స్ గురించి రాయలసీమవాసులు కథలుకథలుగా చెప్పుకంుటుంటారు.
ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన గ్లెన్ గత ఆరు నెలలుగా అనంత పురం ఫ్యాక్షనిస్టులతో సాహవాసం చేస్తున్నాడని పోలీసులు పసిగట్టారు. తన వృత్తిలోకి ఫ్యాక్షనిస్టులను దించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. గత పాతికేళ్లుగా నకిలీ సర్టిఫికేట్లు తయారీపైనే జీవిస్తున్న గ్లెన్ బ్రిగ్స్‌పై వివిధ ప్రాంతాల్లో పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
ఏపీ, కర్నాటక పోలీసులకు మోస్ట్ వాంటెండ్‌గా ఉన్న గ్లెన్స్ బ్రిగ్స్‌ను పామిడి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గ్లెన్స్ బ్రిగ్స్‌తోపాటు ఐదుగురిని అరెస్టు చేసిన పామిడి రూరల్ పోలీసులు.. వారి వద్ద నుంచి 70 తులాల బంగారం, ఇన్నోవా కారు, పోలీస్ నేమ్ బోర్డు, ఐడికార్డు, సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.