తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలుపు ఓ గెలుపేనా..అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారన్నారు. ప్రజలను అవమానించేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమంటూ విరుచుకుపడ్డారు. 2009 సిరిసిల్ల ఎన్నికల్లో కేటీఆర్ కేవలం 171 ఓట్లతోనే గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు రేవంత్‌రెడ్డి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. 10,919 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.