ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. మాతృవియోగం పొందిన చినజీయర్ ను వెంకయ్య ఫోన్ ద్వారా ఆత్మీయంగా పరామర్శించి తన సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. చినజీయర్ స్వామిలో ధార్మిక, సామాజిక దృష్టి కోణం ఏర్పడడానికి మాతృమూర్తి మంగతాయారు పాత్ర ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంప్రదాయ మధ్యతరగతి గృహిణిగా పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. బాల్యం నుంచే భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, ధార్మిక చింతన, దయాగుణం, విలువలు, ఆచార సంప్రదాయాలు వంటి అంశాలను పిల్లలకు ఉద్బోధించడం ద్వారా వారి వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో మంగతాయారు పెంపకం ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు. 23 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరిస్తానని చెబితే సమాజ హితం కోసం మరోమాటకు తావులేకుండా అంగీకరించిన త్యాగధనురాలు మంగతాయారు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సందేశంలో కీర్తించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తునానమని తెలిపారు. కాగా, చినజీయర్ స్వామి తల్లి పరమపదించిన సంగతి తెలసిందే.