‘దాచుకున్న సొమ్మంతా ఎత్తుకెళ్లాయి దొంగకోతులు’ అంటూ బోరుమంటోంది శరతంబల్! వెతికిపెట్టమంటూ పోలీసులను బతిమాలుకుంటోంది. పాపం ఆమెకొచ్చిన కష్టం అంతా ఇంతా కాదు.. దొంగనైతే పట్టేసుకోవచ్చు.. దొంగ కోతులను ఎలా పట్టుకోవడం? అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని తిరువైయారులో జి.శరతంబల్ అనే 70 ఏళ్ల వితంతువు ఒంటరిగా జీవిస్తోంది.. కష్టపడి అంతో ఇంతో కూడ పెట్టుకుంది. అవసరార్థం ఉపయోగపడుతుందని సొమ్మునంతా జాగ్రత్తగా దాచిపెట్టుకుందామె! జాగ్రత్తగా అంటే ఓ బియ్యం సంచిలో భద్రపరచుకుంది.. కొంచెం నగదు.. కొద్దిపాటి బంగారం ఉన్నాయందులో! రెండు రోజుల కిందట ఆమె బట్టలు ఉతుక్కోవడం కోసం ఇంట్లోంచి బయటకు వెళ్లింది.
ఇలా ఆమె బయటకు వెళ్లగానే కోతులు ఇంట్లో దూరాయి. కనిపించిందేదో తినిపోకుండా ఆ బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయా దొంగకోతులు. ఇంటికొచ్చిన శరతంబల్‌కు బియ్యం సంచి కనిపించకపోయే సరికి షాకయ్యింది. ఇంటిపై కప్పుమీద ఉన్న కోతుల చేతుల్లో ఆ బియ్యం సంచి చూసి పట్టుకోవడానికి ప్రయత్నించింది. కోతులు కదా! దొరికినట్టే దొరికి పారిపోయాయి. పాపం శరతంబల్ వాటి వెంటపడింది. కానీ అవి దొరకలేదు. ఆమె కష్టం చూసి చుట్టుపక్కలవాళ్లు కూడా కోతుల వెంట పరుగెత్తారు కానీ లాభం లేకపోయింది. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును ముదనష్టపు కోతులు ఎత్తుకెళ్లాయంటూ శోకాలు పెడుతోంది శరతంబల్.
Also Read:
Kushboo Eye Injury : ప్రముఖ నటి కుష్బూ కంటికి గాయం
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో 50 శాతం కోత
నటి శివ పార్వతికి కరోనా పాజిటివ్.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన!