Latest Health Tips: చేప మాంసం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆస్తమా( తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి) కు చెక్ పెట్టొచ్చని డాక్టర్స్ అంటున్నారు. అంతేకాదు హృద్రోగ సమస్యలున్న వారు కూడా చేప మాంసం తినడం చాలా మంచిదని వారి సలహా. తాజాగా ఆస్ట్రేలియా లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సౌతాఆఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన చేయగా.. ఈ విషయం వెల్లడైంది.
యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఆండ్రీయాస్ మాట్లాడుతూ ‘ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య గత 90 ఏళ్లలో దాదాపు రెట్టింపు అయింది. ప్రస్తుతం మార్కెట్ లో లభించే మందుల వల్ల ఆస్తమా రోగులకు ఎలాంటి ఉపశమనం లభించట్లేదు. కాబట్టే మెడిసిన్ రహిత చికిత్సలో భాగంగా ఈ పరిశోధన చేశాం అని ఆయన చెప్పారు.
చేపల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకున్న వారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 62 శాతం వరకు తగ్గినట్లు గుర్తించాం అని వారు అన్నారు. ఇక కూరగాయల ద్వారా లభించే ఎన్-6 పాలీసాచురేటెడ్ ఆయిల్స్ తీసుకున్నవారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 67 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కాగా తీర ప్రాంతంలో కేవలం చేపల వేటపై ఆధారపడిన వాళ్ళ మీదే ఈ పరిశోధన చేసినట్లు ఆయన తెలిపారు.