స్మిత్‌కు సరిలేరు.. కోహ్లీకి సాటెవ్వరూ.!

స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ప్లేయర్, ఆసీస్ జట్టుకు ‘ది వాల్’ అని చెప్పాలి. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ అనంతరం జట్టు పగ్గాలను అందుకున్న స్మిత్.. అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. కొందరు కెప్టెన్సీ బాధ్యత చేపట్టిన తర్వాత ఒత్తిడితో తమ ఫామ్‌ను కోల్పోతుంటారు. కానీ స్మిత్.. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటి కంటే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత అద్భుతంగా రాణించాడు. సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా ఆసీస్‌కు ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. […]

స్మిత్‌కు సరిలేరు.. కోహ్లీకి సాటెవ్వరూ.!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 06, 2019 | 10:43 PM

స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ప్లేయర్, ఆసీస్ జట్టుకు ‘ది వాల్’ అని చెప్పాలి. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ అనంతరం జట్టు పగ్గాలను అందుకున్న స్మిత్.. అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. కొందరు కెప్టెన్సీ బాధ్యత చేపట్టిన తర్వాత ఒత్తిడితో తమ ఫామ్‌ను కోల్పోతుంటారు. కానీ స్మిత్.. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటి కంటే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత అద్భుతంగా రాణించాడు. సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా ఆసీస్‌కు ఎన్నో విజయాలను కట్టబెట్టాడు.

స్పిన్ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన స్మిత్.. తనదైన శైలి అసాధారణ టెక్నిక్‌తో వరల్డ్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. బౌలర్ ఎవరైనా సరే.. ఏమాత్రం లొంగకుండా.. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. అలెన్ బోర్డర్ – రికీ పాంటింగ్ – మైఖేల్ క్లార్క్ తర్వాత స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా గొప్ప రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా 2018లో బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని కెప్టెన్సీ పదవి నుంచి స్టీవ్ స్మిత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తప్పు జరిగింది.. దానికి శిక్ష అనుభవించాడు.. రీ-ఎంట్రీ ఇచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్‌తో తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న స్మిత్.. పలు మ్యాచ్‌ల వ్యవధిలోనే తన ఫామ్‌ను పొందాడు. ఇక వరల్డ్ కప్ అనంతరం యాషెస్ సిరీస్.

సిరీస్‌లు మాత్రమే మారుతున్నాయి.. కానీ స్టీవ్ స్మిత్ ఫామ్ మాత్రం అలానే ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లకు తన అద్భుతమైన ఫామ్‌తో చుక్కలు చూపిస్తున్నాడు. ఏడాది తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. తనంతట తాను వికెట్ ఇస్తే అదే గొప్పని ఇంగ్లాండ్ బౌలర్లు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే స్మిత్ నాలుగో యాషెస్ టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు పునరాగమనం తర్వాత టెస్ట్‌లలో నెంబర్ వన్ ర్యాంక్ తిరిగి దక్కించుకోవడానికి స్మిత్‌కు ఎంతో సమయం పట్టలేదు. మాజీల నుంచి లెజెండ్స్ వరకు స్టీవ్ స్మిత్ టెక్నిక్‌కు, అసాధారణ బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయారు. ఇది ఇలా ఉండగా క్రికెట్ అభిమానుల్లో కొందరు 20వ దశకంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ స్మిత్ అని.. మరికొందరు విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియా వేదికగా ‘వార్‌’కు దిగుతుండటం చూస్తున్నాం. అయితే ఇద్దరూ కూడా 20వ దశకంలో ది బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పడంలో తప్పులేదు.

విరాట్ కోహ్లీ.. మోడరన్ ఎరాలో రన్ మిషన్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత సారధ్య బాధ్యతలను చేపట్టి టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. గ్రౌండ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కూడా అదే దూకుడుతో సెంచరీల మీద సెంచరీలు అవలీలగా బాదేస్తాడు. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే చాలు సగటు అభిమాని ఆ మ్యాచ్ భారత్‌దేనని కన్ఫర్మ్ చేసుకుంటాడు.

టెస్ట్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో.. వన్డే ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను ఇప్పటికే తన సొంతం చేసుకున్న విరాట్ .. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును కూడా తొందరలో చెరిపేయగలడు.

ఇక ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇద్దరూ కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన గొప్ప ఆటగాళ్లే. ఎవరి శైలిలో వారు ది బెస్ట్. కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌లో స్టీవ్ స్మిత్ ఆటను ఇష్టపడే వాళ్ళ ఉండవచ్చు. అలాగే స్టీవ్ స్మిత్‌ను ఇష్టపడే వాళ్ళులో విరాట్‌ను కూడా లైక్ చేయవచ్చు. అందుకే ఇద్దరి మధ్య పోలికలు పెట్టే కంటే.. ఇద్దరి ఆటను ఆస్వాదించడం మంచిది.