ఆర్టీసీ విలీనమే ప్రధాన ఎజెండాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియజేయజేశారు.
సకలజనులభేరీ సభతో తమ పోరాటాన్ని ఆర్టీసీ కార్మిక జేఏసీ మరింత ముందుకు తీసుకెళ్లింది. తమ వాయిస్‌ను వినిపించేందకు పక్కా ప్రణాళికను రూపొందించిందన కార్మిక నేతలు భారీగానే ప్రజల మద్దతును అందుకున్నారు. పోలీసులు సభకు అనుమతి లేదంటూ అడ్డంకులు సృష్టించినప్పటికి కోర్టుకెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుంది జేఏసీ. బహిరంగసభలో అన్నీ పక్షాలను ఏకం చేసేందుకు చేసిన ప్రయత్నానికి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. నిన్నటి వరకూ డిమాండ్ల పరిష్కారం కోసం వేర్వేరు తరహాల్లో నిరసన చేపట్టిన కార్మికులు బహిరంగసభ ద్వారా తమ స్వరాన్ని పెంచి …ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు కార్మికుల పక్షాన తమ వాయిస్‌ను వినిపించారు. సమ్మెతో తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. గమ్యాన్ని చేరే వరకు పోరాడిల్సిందేనని ఆర్టీసీ కార్మికులకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. వేతనాలు ఇవ్వకున్నా.. ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా కీలక పాత్ర పోషించామని చెప్పారు. రామాయణంలో ఉడతలా అప్పటి ఉద్యమంలో కేసీఆర్‌కు దారి చూపించామని..అలాంటి తమపై కక్షపూరిత ధోరణి సరికాదని పేర్కొన్నారు. కాగా కోర్టు సభకు కొన్ని పరిమితులను నిర్దేశించినప్పటికి..తాము చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్టీసీ జేఏసీ చేసిన కృషి ఫలించింది.