మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు మరో అరుదైన అవార్డు దక్కింది. కేరళ ప్రభుత్వం ఇళయరాజాకు ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, కంపోజర్, గాయకుడు, వాయిద్యకారుడు అయిన ఇళయరాజా ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం ఇటీవలే ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.
తాజాగా కేరళ ప్రభుత్వం ఆయనకు “హరివరాసనం’ అవార్డును బహుకరించి, సత్కరించనున్నట్లు ప్రకటించింది. అయ్యప్ప పవళింపు సేవలో “హరివరాసనం’ పాడతారన్నది విధితమే. ఇక జనవరి 15న ఈ అవార్డును శబరిమలలో ఇళయరాజాకు అందజేయనున్నట్లుగా అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆయన ఇదంతా ఆ హరిహర సుతుడు అయ్యప్ప కరుణా కటాక్షాల కారణంగానే సాధ్యమైందని చెప్పారు.