కర్నాటకలో రాజకీయ సంక్షోభం మారిపోతోంది. కుమారస్వామి సర్కార్‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కుమారస్వామి అమెరికాలో ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు పార్టీని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పొత్తుతో సర్కార్‌ను నడుపుతున్న జేడీఎస్ అధినేత కుమారస్వామికి 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతునట్లు సమాచారం. గతంలోనే ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేశారు. వాళ్లను ఆపడానికి కాంగ్రెస్ రాష్ట్ర సారథి సిద్ధారామయ్య శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈలోగా మరో 15 మంది కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు వెళ్లబోతున్న హడావిడి కర్నాటకలో కనిపిస్తోంది. గతంలో జేడీఎస్ స్టేట్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన విశ్వనాథే.. ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణమై ఉంటారని ఆ పార్టీ అనుమాస్తోంది.
కాగా, కర్నాటక అసెంబ్లీలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లలో గెలిచింది. కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. అయితే ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆనంద్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్ బలం 116కు పడిపోయింది. తాజాగా మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదిస్తే కూటమి బలం 108కి పడిపోతుంది. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.