రాతి క్వారీలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు కార్మికులు దుర్మరణం
కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో గురువారం (జూలై 02) ఘోర ప్రమాదం సంభవించింది. తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రాతి క్వారీలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారని సమాచారం. ఈ ఆకస్మిక ప్రమాదంతో క్వారీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు, తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికులు ఎప్పటిలాగే క్వారీలో రాళ్లను తవ్వే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక భారీ బండరాయి విరిగి కింద ఉన్న కార్మికులపై పడింది. దీంతో పలువురు కార్మికులు భారీ శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగాయి. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాల వెలికి తీసేందుకు ప్రయత్నించారు..
శిథిలాలను తొలగించి ఏడుగురు కార్మికుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మృతులు బీహార్ నివాసితులుగా ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, వారి పూర్తి వివరాలను, గుర్తింపును నిర్ధారించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మరికొందరు కార్మికులు కూడా ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు గనిలోని మిగతా కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక బృందాలు క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తగా క్వారీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు ఆధీనంలోకి తీసుకుని దిగ్బంధించారు. ఈ ఘోర ప్రమాదం సహజ సిద్ధమైన కారణాల వల్ల జరిగిందా, లేక క్వారీ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..