గోమూత్రం అంటే భారతీయులకు ఎనలేని గౌరవం. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో గోమూత్రం తప్పని సరిగా ఉండాల్సిందే. ఇప్పుడు మరోసారి గోమూత్రం ప్రత్యేకత బయటపడింది. గోమూత్రంలో ఔషధ గుణాలే కాదు జపాన్‌లో రైతులు బంగారం పండిస్తున్నారు..బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. ఇంతకీ అసలు వివరాల్లోకి వెళ్లి…
నార్తరన్ జపాన్ ఆధారిత సేంద్రీయ ఉత్పత్తుల కంపెనీ Kankyo Daizenచేపట్టిన ప్రయోగం అక్కడి రైతులకు కాసుల పంటపండిస్తోంది. బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో గోమూత్రంతో సరికొత్త ప్రయోగం చేపట్టింది సంస్థ. సౌత్ ఈస్ట్ ఏసియాలోని రైతుల దగ్గర గోవుల నుంచి మూత్రాన్ని Kankyo Daizen కంపెనీ సేకరిస్తోంది. Tsuchi Ikikaeru అనే సేంద్రీయ ఎరువు పేరుతో లిక్విడ్ రూపంలో తిరిగి సాగు రైతులకు అందిస్తోంది.
సారవంతం కోల్పోయిన భూముల్లో తిరిగి జీవాన్ని నింపేందుకు ఈ గోమూత్రం ఎరువు అద్భుతంగా పనిచేస్తుందని సదరు కంపెనీ చెబుతోంది. అంతేకాదు… జపాన్ దేశానికి మాత్రమే పరిమితం కాకుండా మరో ఐదు దేశాల్లో వియత్నాం, కంబోడియాలకు కూడా ఈ సేంద్రీయ ఎరువును సరఫరా చేస్తోంది కంపెనీ. ఈ ఉత్పత్తులను నీటిలో కలిపి పంటలకు ఎరువుగా అందిస్తే బాగా పండుతాయని అంటోంది. వరి, కూరగాయలు, పూల పంటలు, రొయ్యల పెంపకం వంటి పంటలకు నాణ్యమైన దిగుబడిని అందిస్తుందని పేర్కొంది. అంతేకాదు.. భూసారం కూడా బాగా పెరుగుతుందని.. పంట వేసిన పొలాల్లో మరుసటి ఏడాది అదే పంట వేసినా దిగుబడి బాగా వస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ ప్రకృతిసిద్ధమైన సేంద్రీయ ఎరువు సాయిల్ కండీషనర్‌గా విదేశీ కస్టమర్ల ప్రశంసలను అందుకోంటోంది. Kankyo Daizen కంపెనీ ఉత్పత్తి చేసే సేంద్రీయ ఎరువులు, డియోడరైజెస్ లకు విదేశీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. జనవరి నాటికి 12 నెలల కాలంలో ఈ కంపెనీ సేల్స్ 11 శాతంగా పెరిగి 230 మిలియన్ల yen (2.13 మిలియన్ల డాలర్లు) ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విదేశీ ఎగుమతులతో ఈ కంపెనీ ఆదాయం మొత్తంగా 10 శాతానికి పెరిగింది. ఈ సేంద్రీయ ఎరువులను పొలాల్లో ఎరువులుగా జల్లితే మంచి దిగుబడిని సాధిస్తాయిని గట్టిగా చెబుతోంది.