కోవిడ్ పాండమిక్ నుంచి దేశం మెల్లగా బయటపడుతోంది. ఆర్ధిక మాంద్యం లోకి వెళ్లబోతోందన్న అంచనాలు వచ్చినా..ప్రస్తుతం ఆ పరిస్థితి నంచి బయటపడ్డామని ఆర్ బీ ఐ తెలిపింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి వృద్ది పాజిటివ్ జోన్ లోకి వెళ్తుందని తాజాగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆర్ బీ ఐ తన ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ బులెటిన్ లో తెలిపింది. ఇండియన్ ఎకానమీ లోతైన కోవిడ్ 19 సంక్షోభం నుంచి బయటపడుతోంది.. శీతాకాల ‘షాడో’ల’ నుంచి మళ్ళీ ‘వెలుగుల’ వైపు విస్తరిస్తోంది అని కాస్త కవిత్వాన్ని కూడా ఈ బులెటిన్ అభివర్ణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ది రేటు 23.9 శాతానికి, రెండో క్వార్టర్ నాటికి 7.5 శాతానికి కుదించుకుపోయింది. మూడో త్రైమాసికం..అక్టోబరు-డిసెంబరులో జీడీపీ 0.1 శాతం వృద్దిని సాధించే వీలుందని అంటున్నారు. తాజా ‘ఆశల మేరకు’ వచ్ఛే ఆర్ధిక సంవత్సరం 2021-22 తొలి అర్థ భాగంలో ఎకానమీ 14.2 శాతం వృద్దిని సాధించే అవకాశాలున్నాయి.
కోవిడ్ ను ఇండియా అదుపు చేయగలిగిందని, సెప్టెంబరు మధ్య కాలం నుంచి ఇన్ఫెక్షన్లు తగ్గడంతో ఇన్వెస్ట్ మెంట్, వినియోగసంబంధ డిమాండ్ పెరుగుతూ వచ్చిందని ఈ బులెటిన్ వ్యాసకర్తలు అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర్ 2.0.3.0 ప్యాకేజీలు కూడా ఆర్థిక వృద్దికి తోడ్పడ్డాయని వీరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణ స్థితి కూడా చాలావరకు మెరుగుపడి ఎకానమీ తిరిగి మునుపటిలాగే పూర్తిగా పుంజుకుంటుందని వారు పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఈ వ్యాసకర్తల అభిప్రాయాలే అని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ అంచనాలు తప్పనిసరి కాదని కూడా పేర్కొంది.