యాషెస్ సిరీస్‌ను తలదన్నే రీతిలో.. భారత్-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల మధ్య తూటాల్లా పేలుతున్న మాటలు..

ఒకవైపు వరల్డ్ నెంబర్ 1 జట్టు.. మరోవైపు నెంబర్ 3 టీమ్.. ఇరు జట్లలోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఒకరు వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే..

యాషెస్ సిరీస్‌ను తలదన్నే రీతిలో..  భారత్-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల మధ్య తూటాల్లా పేలుతున్న మాటలు..
Follow us

|

Updated on: Dec 13, 2020 | 7:00 PM

India Vs Australia 2020: ఒకవైపు వరల్డ్ నెంబర్ 1 జట్టు.. మరోవైపు నెంబర్ 3 టీమ్.. ఇరు జట్లలోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఒకరు వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే.. మరొకరు టీ20 సిరీస్ దక్కించుకున్నారు. ఎవరి గురించి చెబుతున్నానో.! ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. మీ గెస్ కరెక్టే.! ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ యాషెస్ సిరీస్‌ను తలదన్నే రీతిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా రెండు జట్ల తుది కూర్పు ఇంకా ఫైనల్ కాలేదు.. టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ఏమో మూడు రోజులు సమయం మాత్రమే ఉంది. ఎప్పుడూ లేనంతగా ఈ సిరీస్ ప్రేక్షకులకు హైవోల్టేజ్ షాక్ ఇస్తోంది. ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వెంటాడుతుంటే.. టీమిండియా జట్టు కూర్పు ఇంకా ఫైనల్ కాలేదు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్దాలు పీక్స్‌కు చేరడం మరో ఎత్తు.

డేవిడ్ వార్నర్, విల్ పుకోవిష్క్ గాయాలు కారణంగా మొదటి టెస్టుకు దూరం కావడం.. మార్కస్ హారిస్, జో బర్న్స్ నిలకడలేమితో సతమతమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్ల కోసం వెతుకులాటలో ఉంది. అటు టీమిండియా ఓపెనింగ్ స్లాట్స్ భర్తీ చేసేందుకు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లలో ఎవరు సెట్ అవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆసీస్‌ జట్టులో పలువురు పేసర్లు కూడా గాయంతో దూరం కావడం.. వారికి పెద్ద మైనస్. టీమిండియాకు వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎవరు చేపడతారో ఇంకా తెలియాల్సి ఉంది. పంత్, సాహాల కంటే మొదటి ప్రయారిటీ రాహుల్‌కే ఇస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే ఇరు జట్ల మాజీ క్రికెటర్ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ”క్రికెట్ నియమాలను సరిగ్గా పాటించకుండా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకుంటున్నారని” ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్ కామెంట్ చేయగా.. ”మమ్మల్ని చూసి ఏడవకుండా.. మీ జట్టుకు తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందు ఆ విషయంపై దృష్టి పెట్టమని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ చురకలంటించాడు. వీళ్ళిద్దరూ మాత్రమే కాదు మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం ఈ సిరీస్‌పై పలు సంచలన కామెంట్స్ చేశారు.