అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే.. దేశంలో అనేక చోట్ల వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ‘ జై శ్రీరామ్ ‘ నినాదాలతో ఆయా ప్రాంతాలు హోరెత్తిపోయాయి. అయోధ్యలో సాధువులు, సంత్ లు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా.. హిందూ వలంటీర్లు ఆనందం పట్టలేకపోయారు. కోర్టు తీర్పు అనంతరం పెద్ద సంఖ్యలో ఉన్న తన అనుచరులు, సహచరులతో కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వచ్చిన నిర్మోహి అఖాడా నేత ధరం దాస్ ను హిందూ లాయర్లు సైతం అభినందనలతో ముంచెత్తారు. ఆయన సహచరులను ‘ అదుపు ‘ చేయడానికి వారు కూడా శ్రమించాల్సి వచ్చింది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు తమ మద్దతుదారులతో వీధుల్లో ” ఊరేగింపులు ” నిర్వహించారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రధాని మోదీకి రాజకీయ విజయమని కమలనాథులు అభివర్ణించారు. ఇన్నేళ్ళుగా ఎడతెగని వివాదానికి మోదీ ప్రభుత్వం విజయవంతంగా ముగింపు పలికిందని వారు వ్యాఖ్యానించారు. తీర్పునకు ముందు కోర్టు ప్రాంగణం దేశీ, విదేశీ జర్నలిస్టులతో నిండిపోయింది.