ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని, 2030 ఇది నాటికి సాధ్యమవుతుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తెలియజేసింది. గతేడాది భారత్ బ్రిటన్‌ను వెనుకకు నెట్టి ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆరో స్థానంలోకి పడిపోయింది.
కానీ, 2025 నాటికి బ్రిటన్‌ను మళ్లీ వెనక్కి నెట్టి భారత్ ఐదో స్థానంలో వస్తుందని బ్రిటన్‌కు చెందిన సీఈబీఆర్ పేర్కొన్నది. భారత వృద్ధిలో వ్యవసాయ రంగం వాటా కీలకమని తెలిపింది. వ్యాక్సిన్ల తయారీలో భారత్ అగ్రగామిగా ఉండటం.. ఈ కరోనా పరిస్థితుల్లో కలిసొస్తున్నదని, చాలా దేశాలతో పోల్చితే వచ్చే ఏడాది భారత్‌లో ప్రజలకు వ్యాక్సిన్ల ప్రకియ విజయవంతంగా అందుతుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.
భారత దేశ జీడీపీ భవిష్యత్‌లో 9 శాతం వృద్ధిని కనబర్చవచ్చని సీఈబీఆర్ అంచనా వేసింది. అయితే 2022లో జీడీపీ 7 శాతానికి తగ్గవచ్చిని పేర్కొంది. కాగా, 2025లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను, 2027లో జర్మనీ, 2030లో జపాన్ ఆర్థిక వ్యవస్థల్ని భారత్ దాటేస్తుందని సీఈబీఆర్ పేర్కొంది. 2028లో అమెరికాను చైనా అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని సీఈబీఆర్ అంచనా వేయడం గమనార్హం. కరోనా దెబ్బకు అమెరికా విలవిలలాడిపోతున్న నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గతంలో తాము వేసిన అంచనా కంటే ఐదేండ్ల ముందే డ్రాగన్ వెనుకకు నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది.