వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు తమ ప్రొటెస్ట్ ను దేశవ్యాప్తం చేయదలిచారు. ఇందులో భాగంగా కుల మతాలను పక్కన పెట్టి ముఖ్యంగా దళితులను తమతో కలిసి రావాలని వారు కోరుతున్నారు. హర్యానాలోని హిస్సార్ లో శనివారం జరిగిన మహాపంచాయత్ లో పెద్ద సంఖ్యలో దళితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతునేత గుర్నామ్ చాధుని.. అన్నాదాతలకు, దళితులకు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని, దీన్ని ఇక దేశవ్యాప్తం చేస్తామని ఆయన చెప్పారు. తమ పోరాటం కేవలం ప్రభుత్వంపైనే కాదని, పెట్టుబడిదారులపై కూడా నని ఆయన చెప్పారు. ప్రతి దళితుడు తన ఇంట్లో బాబా సాహెబ్ అంబెడ్కర్ ఫోటోలను పెట్టుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు తప్ప మరెవరికైనా ఓటు వేయాలని ఆయన సూచించారు.
ఈ ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని గుర్నామ్ ఆరోపించారు. ఇన్ని దఫాలుగా చర్చలు జరిగినా కేంద్రం ఏదో ఒక సాకు చెప్పి మా ఆందోళనను పక్కదారి పట్టించే యత్నం చేస్తోందన్నారు. కాగా.. రైతు నేత రాకేష్ సింగ్ తికాయత్ త్వరలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి మరింతమంది రైతులను సమీకరించేందుకు మహా పంచాయత్ లను నిర్వహించనున్నారు.
Also Read: