భారత్‌ను సూపర్‌ పవర్‌గా చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యం: ప్రధాని

జాతీయ విద్యా విధానం-2020పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నూతన విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం చాలా పరిమితంగానే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు

భారత్‌ను సూపర్‌ పవర్‌గా చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యం: ప్రధాని

Updated on: Sep 08, 2020 | 2:13 PM

జాతీయ విద్యా విధానం-2020పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నూతన విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం చాలా పరిమితంగానే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ‘రోల్‌ ఆఫ్‌ ఎన్‌ఈపీ ఇన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

నూతన జాతీయ విద్యా విధానం కేవలం ప్రభుత్వ విధానం కాదని.. భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం, దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి అవసరముందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను అభ్యసించేందుకు ఎలాంటి ఒత్తిళ్లు, ఎలాంటి ప్రభావం లేని విధంగా జాతీయ విద్యావిధానం ఉండాలని ప్రధాని అన్నారు. విద్యార్థులపై అవసరానికి మించిన స్కూలు బ్యాగుల, బోర్డు పరీక్షలు, సొసైటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేని విధంగా జాతీయ విద్యా విధానం ఉండాలన్నారు. కాగా, ఈ కాన్ఫరెన్స్‌లో గవర్నర్లు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులు హాజరయ్యారు.

డాక్టర్ కె.కస్తూరి రంగన్ సారథ్యంలోని ప్యానల్ దేశంలోని పలువురు విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహా 2 లక్షల మంది అభిప్రాయాలను సేకరించి సుదీర్ఘకాలం చేసిన కసరత్తు అనంతరం ఎన్‌ఈపీ రూపకల్పన జరిగింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా సంస్కరణలు తీసుకురావడం, భారత్‌ కేంద్రంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా తయారు చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఎన్‌ఈపీ–2020పై సెప్టెంబర్‌ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్‌ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే…భారత్‌ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు.