స్మార్ట్ కెమెరాలతో ఇస్మార్ట్ బాదుడు: ట్రాఫిక్ చలాన్లలో అదేరోజు సైబరాబాద్ కమిషనరేట్ సరికొత్త రికార్డు

|

Dec 24, 2020 | 7:56 AM

భాగ్య నగరంలో ట్రాఫిక్ పోలీసులు చరిత్ర సృష్టించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇదివరకు ఎన్నడూ లేని తరహాలో ఒకే రోజులో భారీగా చలాన్లు వేసి..

స్మార్ట్ కెమెరాలతో ఇస్మార్ట్ బాదుడు: ట్రాఫిక్ చలాన్లలో అదేరోజు సైబరాబాద్ కమిషనరేట్ సరికొత్త రికార్డు
Follow us on

భాగ్య నగరంలో ట్రాఫిక్ పోలీసులు చరిత్ర సృష్టించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇదివరకు ఎన్నడూ లేని తరహాలో ఒకే రోజులో భారీగా చలాన్లు వేసి రికార్డు నెలకొల్పారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపట్ల ఉక్కుపాదం మోపి ఫోటోలు తీసేశారు. కరోనా వైరస్ ప్రభావంతో జనతా కర్ఫ్యూ విధించిన తేదీకి ముందు రోజు ఈ రికార్డు నమోదైంది. ప్రతీ శనివారం ట్రాఫిక్‌ పోలీసులకు స్పెషల్‌ డ్రైవ్‌లంటూ ఏమీ లేకపోవడంతో, రోడ్లపైనే ఉండి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. కెమెరాలు చేతిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దృష్టి పెట్టారు. ఒక్కరోజే 22,080 ట్రాఫిక్‌ ఈ-చలానాలు వేశారు. సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 10 వేల నుంచి 13 వేల వరకూ మాత్రమే ఉంటుంది. కానీ, శనివారం మాత్రం దాదాపు రెట్టింపు సంఖ్యలో చలాన్లు జారీ చేసి రికార్డు నమోదు చేశారు.

ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న మాదాపూర్ ప్రాంతం సహా.. బాలనగర్, శంషాబాద్‌ జోన్లలోని 10 ట్రాఫిక్ పీస్‌ల పరిధుల్లో ఈ సంఖ్య నమోదైంది. చలానాలు పడ్డ వారిలో ఎక్కువగా రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్, ట్రిపుల్‌ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, వంటి ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్కడా వాహనాలను రోడ్లపై ఆపి తనిఖీ చేయక పోవడంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడ్డ కేసులు నమోదు కాలేదు. అయితే సైబరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం 2,497 ఈ చలాన్లను జారీ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో అత్యధికంగా 70 శాతం దాకా ద్విచక్ర వాహనదారులే ఉన్నారని అధికారులు చెప్పారు.