తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా సోకింది. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రకాశ్ గౌడ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని, కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దని ప్రకాష్ గౌడ్ కోరారు. తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానన్నారు.