ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పలు తీర్చలేక అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదఘటన హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జగదీశ్ (34) డయాగ్నొస్టిక్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌లో గేమ్స్‌కు బానిసయ్యాడు. ఇందుకోసం పందెం కాస్తూ ఉన్న డబ్బులు పొగొట్టుకున్నాడు. అంతేకాదు ఇతర స్నేహితులు, బంధువుల నుంచి భారీగా అప్పులు చేసి ఆన్‌లైన్‌లో పందెం కాశాడు. దీంతో భారీగా నగదును కోల్పోయాడు.గతంలో దాదాపు రూ. 12 లక్షలు నష్టపోతే జగదీశ్ తండ్రి ఈ అప్పులను తీర్చాడు.
తాజాగా మళ్లీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ రూ. 15 లక్షలు నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆర్థిక భారం పెరిగి అప్పులవాళ్లతో ఒత్తితి తట్టులేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి తనువు చాలించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.