భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా హైదరాబాద్‌లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ జీవోతో ఇళ్లను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో చేపడుతోన్న సహాయ, పునరావాస చర్యల గురించి ఆయన టీవీ9 కి వెల్లడించారు. శనివారం రాత్రి పడిన వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయన్న మేయర్.. నగరంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయన్నారు. జిహెచ్ఎంసి అన్ని శాఖల సిబ్బందిని అలెర్ట్ చేసామని.. అర్ధరాత్రి నుండి కంట్రోల్ రూమ్ లో అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తంగా 19 రెస్క్యూ టీమ్స్ అలుపెరుగకుండా పని చేస్తున్నాయని.. ఇంకా రిస్కు టీమ్స్ కానీ, ఇతర సిబ్బందిని కానీ పెంచుతామని చెప్పారు. వాటర్ లాగింగ్ సెంటర్ల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టామన్నారు. తక్షణ సాయం కింద ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్ అందజేస్తున్నామన్నారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఇలాగే ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు బయపడవొద్దని.. జాగ్రత్తగా ఉండండని మేయర్ సూచించారు. తాము అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.