ఇండియాలో ప్రస్తుతం రచ్చ రేపుతున్న డ్రగ్స్ యవ్వారం తాజాగా అమెరికాకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 29 న జరిగే తొలి మూడు అధ్యక్ష డిబేట్లలో పాల్గొనే ముందు బిడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిబేట్లలో బిడెన్ తన వాగ్ధాటిని, పర్ఫామెన్స్ ను పెంచుకోవడానికి ఏదో తీసుకుంటున్నారు, అది డ్రగ్స్ అనే నా అనుమానం అన్నారు. డెమొక్రటిక్ ప్రైమరీ సీజన్ డిబేట్లలో జో బిడెన్ తన ‘సత్తా’ను పెంచుకోవడాన్ని తను గమనించానని, ఇదికాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదివరకు స్టేజీపై జరిగిన ఈవెంట్లలో ఆయన నీరసంగా, శక్తి లేనివాడిగా కనిపిస్తే,, ఈ మధ్య మాత్రం మెరుగ్గా కనిపిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అయినా నేనూ డ్రగ్ టెస్ట్ చేయిందుకుంటా.. అని పనిలోపనిగా తన ‘సచ్ఛీలత’ ను ఆయన ప్రకటించుకున్నారు.