AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

India Heavy Rains: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అస్సాంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 80కు చేరగా, కేరళలో రెండు గంటల్లో 300 మి.మీ. వర్షంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
India Heavy Rains
Rajashekher G
|

Updated on: Aug 01, 2026 | 10:29 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు, ఆకస్మిక వరదలు, నీటిమునిగిన రహదారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

అస్సాంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య 80

అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శివసాగర్, చరైదేవో జిల్లాల్లో ఇద్దరు మృతి చెందడంతో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 80కి చేరింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (DRIMS) ప్రకారం శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైదేవో జిల్లాల్లో కలిపి 1.92 లక్షల మందికిపైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. మొత్తం 379 గ్రామాలు నీటమునిగాయి. 15,430 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో పెద్దగా వరదలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహాయ నిధికి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.11 కోట్లు విరాళంగా అందించారు. సినీ నటుడు కార్తీక్ ఆర్యన్ రూ.1 కోటి విరాళం ప్రకటించగా, ముస్లిం రాష్ట్రీయ మంచ్ కూడా వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించింది.

కేరళలో రెండు గంటల్లో 300 మి.మీ. వర్షం.. ఆకస్మిక వరదలు

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కేవలం రెండు గంటల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. పంబా నది పొంగిపొర్లడంతో రన్నీ పట్టణంలోని అనేక ప్రాంతాలు నడుము లోతు వరకు నీటిలో మునిగిపోయాయి. రెడ్ అలర్ట్ నేపథ్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే చాలా మంది తమ ఇళ్లలోని వస్తువులను బయటకు తీసుకురాకముందే వరద నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా కోజికోడ్‌లో నిర్వహిస్తున్న మలబార్ రివర్ ఫెస్టివల్‌లోని వైట్ వాటర్ కయాకింగ్ పోటీలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. చలిపుజా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో పాల్గొనేవారిని, సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత వాతావరణ శాఖ (IMD) అలప్పుజా, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

గుజరాత్‌లో సహాయక చర్యలు వేగవంతం

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఔరంగా నది వద్ద వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది విజయవంతంగా రక్షించారు. జూలై 23 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాలతో మూతపడిన 1,540 రహదారుల్లో ఇప్పటికే 1,451 రహదారులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణ గుజరాత్‌లో అత్యధిక నష్టం సంభవించినప్పటికీ, 1,400 మందికి పైగా సిబ్బంది, భారీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి 98 శాతానికి పైగా రహదారులను పునరుద్ధరించారు.

ఒడిశాలో గ్రామాలు జలదిగ్బంధం

ఒడిశాలోని పూరీ జిల్లా కనాస్ బ్లాక్ పరిధిలోని డోకందర్ గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విద్యుత్, ఆహారం వంటి నిత్యావసరాల కొరత ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. ఇక వరదల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని బిజూ జనతాదళ్ (బీజేడీ), కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఢిల్లీ పర్యటనపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి.

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్‌బర్స్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చత్రూ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ సంభవించింది. ఈ ఘటనలో పలు దుకాణాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రాణనష్టం ఏదీ జరగలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నష్టపోయిన దుకాణాల యజమానులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. గత ఏడాది చసోటి క్లౌడ్‌బర్స్ట్ తర్వాత కిష్త్వార్, మచైల్ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు

హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వర్షాలు కొనసాగుతుండటంతో సాధారణ జనజీవనం దెబ్బతింటోంది. షిమ్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 4 వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, నీటిమునక, జారుడు రహదారుల ప్రమాదం ఉందని ప్రజలకు సూచించింది. అదేవిధంగా పాండో డ్యామ్ నుంచి అదనంగా 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో బియాస్ నదిలో మొత్తం ప్రవాహం సుమారు 36,000 క్యూసెక్కులకు చేరింది. దీంతో నది తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

మహారాష్ట్రలోనూ కుండపోత వర్షాలు

ఇక, మహారాష్ట్ర జల్గావ్‌లో భారీ వర్షాలకు నాగ్‌పూర్-ముంబై హైవేపై ఫ్లైఓవర్ అప్రోచ్ కుంగిపోయింది. మరమ్మతు పనులు చేపట్టిన అధికారులు విచారణకు ఆదేశించారు. మొత్తంగా.. దేశంలోని పలు రాష్ట్రాలను కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Follow Us