అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతల గౌరవ వేతనం పెంచుతాం, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, జనవరి నుంచే అమలు
అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల గౌరవ వేతనాన్ని పెంచుతామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వచ్ఛే యేడాదిని సుహాసన్ పరిణామ్ వర్ష్ గా పరిగణిస్తామన్నారు.

అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల గౌరవ వేతనాన్ని పెంచుతామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వచ్ఛే యేడాదిని సుహాసన్ పరిణామ్ వర్ష్ గా పరిగణిస్తామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ, మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం గుడ్ గవర్నెన్స్ డే గా పాటించిన సందర్భంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వివిధ ప్రజా సంక్షేమ సంస్కరణలు జయప్రదంగా అమలు జరిగేందుకు అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. అర్జున. ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలకు ఇప్పుడు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తోందని, దీన్ని నెలకు 20 వేలకు పెంచుతున్నామని, ఖట్టర్ చెప్పారు. ఇది జనవరి నుంచే అమలులోకి వస్తుందన్నారు. దీనివల్ల 80 మంది అర్జున, 15 మంది ద్రోణాచార్య, 9 మంది ధ్యాన్ చంద్ అవార్డుగ్రహీతలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. భీమ్ అవార్డు గ్రహీతలు 5 వేల గౌరవ వేతనం పొందుతారన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 130 మందికి మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఇంకా… రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు లబ్ది కలిగే పలు పథకాలను ఖట్టర్ ప్రకటించారు. అవినీతిని తొలగించేందుకు భూ బదలాయింపునకు సంబంధించిన అన్ని కేసుల ప్రాసెసింగ్ కి కొత్త ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.



