ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఇంట్లోనే పాతిపెట్టిన భార్య

రూ.12 లక్షల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది. డబ్బుల కోసం ప్రియుడి సహకారంతో.. గుట్టుచప్పుడు కాకుండా భర్తను హతమార్చింది. పోలీసుల విచారణలో దొరికిన ఓ చిన్న క్లూతో బండారం బయటపడి కటకటాల పాలైంది.

ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఇంట్లోనే పాతిపెట్టిన భార్య

Updated on: Aug 18, 2020 | 6:22 PM

మర్డర్‌ చేస్తే చేతికి మట్టి కూడా అంటొద్దన్నట్టుగా క్రిమినల్స్‌ ప్లాన్‌ చేస్తుంటారు. అందుకోసం పక్కా స్కెచ్‌ వేస్తారు. టార్గెట్‌ను ముగించేందుకు కొన్నిరోజులు వేచి చూసి మరీ మర్డర్‌కు ప్లాన్‌ చేస్తుంటారు. అయితే, అవన్నీ పక్కా ప్రొఫెషనల్స్‌ చేసే పనులు. కానీ .. ఇవేవీ ఆమెకు అవసరం రాలేదు. మనుసులో అనుకున్న క్షణమే.. ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేసింది. రూ.12 లక్షల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది. డబ్బుల కోసం ప్రియుడి సహకారంతో.. గుట్టుచప్పుడు కాకుండా భర్తను హతమార్చింది. పోలీసుల విచారణలో దొరికిన ఓ చిన్న క్లూతో బండారం బయటపడి కటకటాల పాలైంది.

గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ బల్లిపల్లి చిరంజీవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కట్టుకున్న రెండో భార్యనే చిరంజీవిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విషయం బయటకు పొక్కకుండా ఇంటి వెనుక భాగంలోనే డెడ్‌బాడీని పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అందుకోసం ఆమె తన ప్రియుడు భానుప్రకాష్‌ సహకారం తీసుకున్నట్టు గుర్తించారు. డబ్బు .. ఎంతటి వారినైనా లొంగదీసుకుంటుంది అంటారు. అదే ఈ కేసులో పోలీసులకు కీలకంగా మారి.. నిందితులను పట్టించేలా చేసింది.

చెరుకుపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న చిరంజీవికి ఇదివరకే వివాహం జరిగింది. అది విడాకులతో పాటు భరణం ఇచ్చే వరకు వెళ్లింది. మరో మహిళ శిరీషతో చిరంజీవికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను రెండు వివాహం చేసుకున్నాడు చిరంజీవి. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. విడాకుల ప్రాసెస్‌లో ఓ ప్రాపర్టీని అమ్మి కొంత మొత్తాన్ని మొదటి భార్యకు ఇచ్చిన చిరంజీవి.. మిగిలిన దాన్ని ఇంట్లో దాచి పెట్టాడు. ఆ డబ్బుపై కన్నుపడ్డ రెండో భార్య శిరీష.. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంది. అప్పటికే ఇంటి పనులతో పాటు డాక్టర్‌ చిరంజీవికి సహాయకుడిగా ఉంటున్న భానుప్రకాష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితోనే తన ప్లాన్‌ను అమలు చేయాలని భావించింది. గుట్టుచప్పుడు కాకుండా భర్త చిరంజీవిని హత్య చేసి ఇంటి వెనకాల గొయ్యి తీసి పాతి పెట్టింది.

ఇదిలావుంటే, మే మొదటి వారంలో జరిగిన ఈ మర్డర్‌ కేసు.. మూడునెలల తర్వాత బయటపడింది. తన కుమారుడు కనిపించడం లేదని డాక్టర్‌ చిరంజీవి ఫాదర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. చిరంజీవి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో రెండో భార్య శిరీష చేసిన తప్పు ఒప్పుకుంది. ఇంట్లో పాతిపెట్టిన మృత దేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. భర్త హత్య కు పాల్పడిన భార్య శిరీష ఆమె ఆమెకు సహకరించిన ప్రియుడు భాను ప్రకాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించామని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం కుదరదని ఈ కేసుతో తేలింది.