ఎయిర్ ఇండియా అమ్మకానికి వ్యూహాత్మకంగా కదులుతున్న కేంద్రం

|

Oct 15, 2020 | 1:56 PM

వివాదాస్పదమైన ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా మరోసారి ప్రైవేట్ వ్యక్తులకే దక్కేలా కనిపిస్తుంది. ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

ఎయిర్ ఇండియా అమ్మకానికి వ్యూహాత్మకంగా కదులుతున్న కేంద్రం
Follow us on

వివాదాస్పదమైన ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా మరోసారి ప్రైవేట్ వ్యక్తులకే దక్కేలా కనిపిస్తుంది. ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. 2018-19 సంవత్సరానికి ఎయిర్‌ ఇండియా రూ. 8,556కోట్లు నష్ట పోయిందని పేర్కొంది. అప్పులు సమస్యగా మారడంతో దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటాలు వదులుకోవడమే మేలని భావిస్తున్నట్టు సమాచారం.

అయితే, దేశంలో అసలు తొలి విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్ ప్రారంభించింది. 1932లో జేఆర్డీ టాటా దేశంలో తొలి విమానయాన సంస్ధను ప్రారంభించటమే కాకుండా తొలి విమానాన్ని నడిపిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అటువంటి విమానయాన సంస్ధను ప్రభుత్వం టేకెన్ ఓవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియాగా మారిపోయింది. టాటాల చేతిలో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా నడిచిన విమాన సంస్ధ ఎప్పుడైతే ప్రభుత్వం చేతిలోకి మారిందో సమస్యలు మొదలయ్యాయి.

ప్రభుత్వం చేతికి మారిన తర్వాత కొత్తల్లో టాటాల భాగస్వామ్యంతో నడిచినా తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. అలాంటి సంస్ధలో సమస్యలు పెరిగిపోతూ చివరకు ఇపుడు మూతపడే దశకు చేరుకుంది. సంస్ధ రూ. 85 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నష్టాల్లో సంస్ధను నడపలేక, సిబ్బందికి జీతబత్యాలు చెల్లించలేక, లాభాల్లోకి తీసుకొచ్చే మార్గాలు కనబడకపోవటంతోనే చివరకు అమ్మేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు గత రెండేళ్ళుగా కేంద్రం ఎంత ప్రయత్నిస్తున్నా కొనటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒకవైపు ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, సిబ్బంది బాధ్యతా రాహిత్యం వ్యవహారించడం వల్లే ఎయిర్ ఇండియా తీరని నష్టాల్లోకి కూరుకుపోయినట్లు సమాచారం. నష్టాల్లో నుండి సంస్ధను బయటపడేసేందుకు 2011-12లో ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయించినా నష్టాల నుంచి బయటపడలేకపోయింది. మరోవైపు, ఎయిర్ ఇండియాను మూసివేయడానికి సిద్ధమయ్యారు. అటు నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. దీనికి విస్తారమైన మౌలిక సదుపాయాలు, ఆస్తులు కాకుండా దాదాపు 15 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూసివేయడం వలన మరింత విలువ క్షీణత ఏర్పడుతుంది.

అమ్మకానికి సంబంధించి కేంద్రం గతంలో విధించిన కొన్ని షరతులను తొలగించటం, కొనుగోలు చేసే సంస్ధకు అనుకూలంగా కొన్ని నిబంధనలను మార్చిన కారణంగా కొన్ని సంస్ధలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయట. సంస్దను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే అప్పుల భారాన్ని కేంద్రప్రభుత్వం కూడా కొంత మోస్తుందన్న హామీ కారణంగానే ఎయిర్ లైన్స్ సంస్ధలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్ధ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కున్న మొత్తం రూ. 60 వేల కోట్ల అప్పుల్లో కొనుగోలు చేయబోయే సంస్ధ రూ. 23 వేల కోట్ల భారాన్ని మోస్తే చాలు. మిగిలిందాన్ని కేంద్రమే భరిస్తుందట. అలాగే ప్రస్తుతం సంస్ధలో ఉన్న 9430 శాశ్వత ఉద్యోగులను కూడా వీలైనంతమందిని తగ్గించే ప్రయత్నాలు మొదలైయ్యాయి. ఇటువంటి అనేక వెసులుబాట్లను తాజాగా ఇవ్వటం వల్లే ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అయితే, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని పెట్టుబడులపై ప్రధాన బృందం తుది కసరత్తులు మొదలుపెట్టింది. మంత్రివర్గ ప్యానెల్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ సాయంతో గ్రౌండ్ వర్క్ చేపట్టాలని భావిస్తోంది కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆసక్తి చూపుతోందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. తాజా ప్రతిపాదనలు వెంటనే తీసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఎయిర్ ఇండియా మార్కెట్ వాటాను కోల్పోవడం వల్ల గత ఏడాది కాలంలో ఈక్విటీ విలువ తగ్గిందని ఐఎంజీ అభిప్రాయపడింది. ఎయిర్ ఇండియా లాభాలపై కొవిడ్ -19 కారణంగా మరింత ప్రభావితం చేశాయి. అదే సమయంలో, రుణ భారం మాత్రమే పెరిగింది. తత్ఫలితంగా, ముందుగా నిర్ణయించిన రుణ స్థాయిని కేటాయించడం హానికరమని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.