ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. నెమ్మదిగా అందరూ నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. కొవిడ్ కారణంగా అందరూ నగదురహిత చెల్లింపులు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ కూడా పిలుపునిచ్చారు. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులకు ఉపయోగిస్తున్న గూగూల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఇటీవల అదనపు చెల్లింపుల విషయంలో గూగూల్ పే వార్తలో నిలిచింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ వినియోగదారులకు క్లారిటీ ఇచ్చింది.
గూగుల్ పే ద్వారా చేసే మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంస్థ అదనపు చెల్లింపులు చేస్తోందని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇది కేవలం అమెరికా యూజర్లకు మాత్రమే అని సంస్థ క్లారిటీ ఇచ్చింది. భారత్‌లో ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదని స్పష్టతనిచ్చింది. కాకపోతే కొత్తరకం ఫీచర్లతో గూగుల్ పే ను అప్‌డేట్ చేస్తున్నామని వెల్లడించింది. ఈ అప్‌డేట్ వెర్షన్ గూగుల్ పే ను కూడా అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా చేసే లావాదేవీలపై అదనపు రుసుం వసూలు చేస్తామని ప్రకటించింది ఇది కేవలం అమెరికావాసులకు మాత్రమే చెప్పింది. ఇండియాలోని గూగుల్ పే వినియోగదారులు ఎటువంటి రుసుం చెల్లించనక్కరలేదని కరాకండిగా చెప్పింది. అలాగే అమెరికాలో నూతన సంవత్సరం నుంచి వెబ్ ఆధారిత గూగుల్ పే ఉండదని కేవలం యాప్‌లో మాత్రమే లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. ఇక భారత్‌లో 30 లక్షల మంది వ్యాపారులు గూగుల్ పే బిజినెస్ యాప్‌ను, 6.7 కోట్ల మంది యూజర్లు గూగుల్ పే ను వినియోగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రతి సంవత్సరం 110 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.