ప్రపంచవ్యాప్తంగా మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగాన్ని సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చిన గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి పంజా విసురుతోన్న తరుణంలో జనసమూహాన్ని తెలియజేసే ఫీచర్‌తో పాటు మరో రెండు విభిన్నమైన ఫీచర్స్‌ని మ్యాప్స్‌లో పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ గూగుల్ ఒక ప్రాంతానికి సంబంధించిన సమాచారం కోసం ఆ ప్రాంతంలో ముఖ్యమైన సమయాల్లో ప్రయాణించే వారి లొకేషన్ ఆధారంగా డేటాను సేకరించేది. స్థానిక ప్రభుత్వ సంస్థలు, రవాణా వ్యవస్థలు, ఇతర సంస్థల నుంచి సేకరించిన డేటాను కూడా విశ్లేషించేది. తాజాగా కొవిడ్-19 లేయర్ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చారు. ఇందులో ప్రతి ఏడు రోజులకు కొత్త కేసుల సంఖ్యతో పాటు కేసుల గ్రాఫ్‌లో హెచ్చుతగ్గులను చూపిస్తుంది. అలాగే స్థానికంగా సేకరించిన సమాచారంతో ఆయా ప్రాంతాల్లో మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, సంభవించిన మరణాల సంఖ్యను కూడా చూడొచ్చు.అంతేకాదు, తాజాగా తీసుకొచ్చిన క్రౌడ్‌నెస్ డేటా ఫీచర్ ద్వారా మీరు ప్రయాణించాలనుకుంటున్న దారిలో ప్రజారవాణాకు సంబంధించిన వివరాలను చూపుతుంది. బస్సులు, రైళ్లు, మెట్రో, సబ్‌వే వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం ద్వారా ప్రయాణించొచ్చు. అయితే ఇందులో మ్యాప్స్ యాప్‌లో యూజర్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే లైవ్ స్టేటస్‌ని గుర్తించి సమాచారం అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ప్రజల నుంచి వచ్చేది కావడంతో అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని కూడా పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. అలాగే, గూగుల్ తన మ్యాప్స్‌ని ఫుడ్ డెలివరీకి అనుకూలమైన కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్‌లలో ఫుడ్ డెలివరీ లైవ్ స్టేటస్, డెలివరీకి పట్టే సమయం, డెలివరీ ఛార్జీలు వంటి వివరాలను కూడా చూపిస్తున్నారు. ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని గూగుల్ తెలిపింది. కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఉపయోగపడే 250 కొత్త ఫీచర్స్‌ని గూగుల్ మ్యాప్స్‌లో యాడ్ చేశామని కూడా గూగుల్ స్పష్టం చేసింది.