Telangana: అలర్ట్.. భద్రాచలంలో కరకట్టకు పొంచి ఉన్న ముప్పు.. వరద ఉద్ధృతితో లీకేజీలు

|

Jul 16, 2022 | 3:42 PM

గోదావరికి (Godavari) వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం (Bhadrachalam) వద్ద నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు....

Telangana: అలర్ట్.. భద్రాచలంలో కరకట్టకు పొంచి ఉన్న ముప్పు.. వరద ఉద్ధృతితో లీకేజీలు
Bhadrachalam
Follow us on

గోదావరికి (Godavari) వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం (Bhadrachalam) వద్ద నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా.. భద్రాచలానికి శ్రీరామరక్షగా ఉన్న కరకట్ట వరద ఉద్ధృతికి బలహీనపడటం ఆందోళన కలిగిస్తోంది. 1986లో గోదావరికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని 1999లో కరకట్ట నిర్మాణం చేపట్టారు. నదిలో ప్రవాహం పెరిగినప్పటికీ నష్టం తగ్గించడానికి ఇది రక్షగా మారింది. గత కొన్నేళ్లుగా కరకట్ట నిర్వహణను పట్టించుకోకపోవడంతో లోపాలు తలెత్తుతున్నాయి. పలుచోట్ల స్లూయీస్‌లకు లీక్‌లు తలెత్తాయి. ఈ ప్రభావం అయ్యప్పకాలనీపై తీవ్రంగా పడింది. సుభాష్‌నగర్‌ కాలనీ చుట్టూ కట్ట ఉన్నప్పటికీ ముంపు తప్పలేదు. మరోవైపు.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీర ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. కరకట్టపైకి ఎవరినీ అనుమతించవద్దని చెప్పారు.

భద్రాచలం వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పందించారు. భద్రాచలం వద్ద వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు రక్షణ సామగ్రి తరలించేలా చర్యలు తీసుకోవాలి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం సూచించారు. సహాయకచర్యలకు హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కేసీఆర్‌ మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాలను వరదనీరు చుట్టుముట్టింది. రామయ్య ఆలయాన్ని వరద నీరు తాకింది. పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్‌ పిస్తా కాంప్లెంక్స్‌ ఏరియా, సుభాష్‌ నగర్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వరద కారణంగా చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు. సిఎం ఏరియల్ సర్వేకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన విధి విధానాలను పర్యవేక్షించి హెలికాప్టర్ రూట్ ను ఫైనల్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..