Andhra News: అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం
ఇటీవల కాలంలో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు ఈ సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా..
Vizianagaram: అద్దె గర్భంతో పిల్లలు పుట్టడం ఇటీవల మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలలో అయితే సర్వసాధారణంగా మారింది. అయితే అదే తరహా అద్దె గర్భం ద్వారా ఒక సంకర జాతి ఆవు అరుదైన గిర్ జాతి ఆవుకు జన్మనిచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామభధ్రాపురం మండలం జగన్నాధపురం లో ఈ ఏడాది మార్చి 9 న గిర్ జాతి ఆవు పిండాన్ని ఒక సంకరజాతి ఆవులో ప్రవేశపెట్టారు. ఆ విధంగా ప్రవేశపెట్టిన పిండం డిసెంబర్ 15 న ఆరోగ్యవంతమైన గిర్ జాతి ఆడ పెయ్యకు జన్మనిచ్చింది. రైతులు ఇలాంటి సరోగసి పద్ధతి ద్వారా విభిన్న జాతుల ఆవుల ఉత్పత్తి వైపు దృష్టి సారించాలని కోరుతున్నారు పశువైద్యాధికారులు. సహజంగా ఆవు తన జీవితకాలంలో ఎనిమిది నుండి పది దూడలకు మాత్రమే జన్మనివ్వగలదు. కానీ ఈ సరోగసి విధానం ద్వారా సుమారు 50 నుండి 60 దూడల వరకు జన్మనివ్వగలదు. ఇలాంటి ప్రక్రియ చేసేందుకు ఇద్దరు పశువైద్యులు కూడా ప్రత్యేక శిక్షణ పొందారు.
అద్దెగర్భంతో ఆవు జనన ప్రక్రియ ఎలా?
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వైద్యులు వినూత్న ప్రయోగం చేసి విజయవంతంగా అద్దె గర్భంతో గిర్ జాతి ఆవుకు జన్మనిచ్చారు. చింతల దీవిలో ఉన్న నేషనల్ కామధేను ప్రాజెక్టు వారి వద్ద ఉన్న మేలు జాతి సాహివాల్, గిర్ మరియు ఒంగోలు జాతి ఆవు నుండి ముందుగా అండాలను సేకరించారు. ఆ అండాలను ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా మేలు జాతి ఆంబోతు వీర్యంతో ఫలదీకరణ చేశారు. అలా ఏడు రోజులు ప్రయోగశాలలో శాస్త్రీయ విధానంలో ప్రక్రియ చేసి పిండలుగా మార్చి అనంతరం ఆ పిండాలను ధ్రవ నత్రజనిలో భద్రపరిచారు. అలా భద్రపరిచిన పిండాలను ఎదకు వచ్చిన ఒక సంకర జాతి ఆవును ఎంపిక చేసి ఆ ఆవులో ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన తరువాత సహజసిద్ధంగానే తొమ్మిది నెలలకు సంకరజాతి ఆవు గిర్ జాతి ఆవుకు జన్మనిచ్చింది.
అద్దెగర్భంతో ఆవు జననం ఎందుకు?
ఇటీవల కాలంలో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు ఈ సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా అద్దె గర్భంతో సంకరజాతి ఆవు నుండి గిర్ జాతి ఆవు జన్మించే ప్రక్రియను చేపట్టి సఫలం అయ్యారు. రైతులు ఇలాంటి సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి ముందుకు రావాలని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..