గుంతల రోడ్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం

|

Aug 04, 2020 | 2:40 AM

హైదరాబాద్ మహానగర పాలక మరో బృహత్తర కార్యక్రమంతో ముందుకువచ్చింది. ఇకపై గుంతలు లేని భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. నగరంలోని ప్రధాన రోడ్లు ఎక్కడైనా పాడైతే వెంటనే సంబంధిత ఏజెన్సీకి ఫోన్‌ ద్వారా గాని వాట్సాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని సూచించింది.

గుంతల రోడ్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
Follow us on

హైదరాబాద్ మహానగర పాలక మరో బృహత్తర కార్యక్రమంతో ముందుకువచ్చింది. ఇకపై గుంతలు లేని భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. నగరంలోని ప్రధాన రోడ్లు ఎక్కడైనా పాడైతే వెంటనే సంబంధిత ఏజెన్సీకి ఫోన్‌ ద్వారా గాని వాట్సాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని సూచించింది. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామంటోంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ జోన్లవారీగా ఆయా సర్కిళ్లలో సంబంధిత నిర్వహణ ఏజెన్సీల కాంటాక్ట్‌ నంబర్లను విడుదల చేసింది.

సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రణాళిక కింద బల్దియా ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. మహానగరంలోని ఆరు జోన్లలో ఏడు ప్యాకేజీలు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో 709.49 కిలోమీటర్ల పొడవున రోడ్లను పునరుద్ధరించడంతోపాటు ఐదేండ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను కూడా సదరు ఏజెన్సీకి అప్పగించింది. ఇందులో ఇప్పటివరకు దాదాపు 300 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యత కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో ఎక్కడైనా రోడ్లు దెబ్బతిన్నా, గుంతలు ఏర్పడినా వెంటనే మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తాజా వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు పాడైనట్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంటర్నల్‌ రోడ్ల నిర్వహణ జీహెచ్‌ఎంసీ చేపడుతున్నప్పటికీ 100 ఫీట్ల వెడల్పున్న ప్రధాన రోడ్ల మరమ్మతులు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆయా సర్కిళ్లవారీగా ప్రధాన రోడ్లు పాడైతే సంబంధిత ఏజెన్సీలకు వెంటనే ఫోన్‌ చేయాలని, లేనిపక్షంలో ఆ నంబర్‌పై వాట్సాప్‌ కూడా చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అక్కడి నుంచి సరైన స్పందన రాకుంటే బలియా కాల్‌ సెంటర్‌ నంబరు 040- 21111111కు కూడా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చంటున్నారు.

జోన్లు, సర్కిళ్ల వారీగా ఫోన్‌ నంబర్లు:

* ఎల్బీనగర్‌ జోన్‌కు సంబంధించి కాప్రా, ఉప్పల్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ తదితర సర్కిళ్లు – 9392676237

* చార్మినార్‌ జోన్‌లోని మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌ సర్కిళ్లు – 9392672646

* ఖైరతాబాద్‌-1 జోన్‌లోని మెహిదీపట్నం, కార్వాన్‌, గోషామహల్‌ సర్కిళ్లు -9492010698

* ఖైరతాబాద్‌-2జోన్‌లోని ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ సర్కిళ్లు -9676195050

* శేరిలింగంపల్లి జోన్‌లోని యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్సీపురం-పటాన్‌చెరు సర్కిళ్లు -9652044949

* కూకట్‌పల్లి జోన్‌లోని మూసాపేట్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్‌ సర్కిళ్లు -9676265050

* సికింద్రాబాద్‌ జోన్‌లోని ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బేగంపేట్‌ సర్కిళ్లు -7794096208