AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Election results 2020: బల్దియాలో చప్పబడ్డ పోలింగ్.. ఫలితాలపై డివిజన్ ఇన్‌చార్జీల్లో గుబులు..

పది రోజులుగా హోరెత్తించిన గ్రేటర్‌ ఎన్నికల సమరం ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్‌ మొదలైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో... అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది.

GHMC Election results 2020: బల్దియాలో చప్పబడ్డ పోలింగ్.. ఫలితాలపై డివిజన్ ఇన్‌చార్జీల్లో గుబులు..
Balaraju Goud
|

Updated on: Dec 04, 2020 | 6:58 AM

Share

ghmc election results 2020: పది రోజులుగా హోరెత్తించిన గ్రేటర్‌ ఎన్నికల సమరం ఫలితాలు కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీల నాయకుల్లో మరో టెన్షన్‌ మొదలైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో… అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. అయా డివిజన్ ఇన్‌చార్జీల్లో కొత్త గుబులు మొదలైంది. గ్రేటర్‌ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్‌చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్‌ ఓటింగ్‌లో లేకపోవడం… వీరికి ఇబ్బందిగా మారింది.. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈసారి అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం నేతలు పోటాపోటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ తరుపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భూజాన వేసుకుని సుడిగాలి పర్యటన నిర్వహించారు. అటు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మొత్తం భాగ్యనగరంపై స్పెషల్ ఫోకస్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వంటి హేమాహేమీలు ప్రచారంలో హోరెత్తించారు. అమిత్‌ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారానికి ఊపు తెచ్చారు. బల్దియా పీఠమే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

అయితే, ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్‌ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు… గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్‌చార్జిలు ఉన్నారు. ఓటర్‌ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. అభివృద్ధి మీద కాకుండా… మతం, దేశం పేరిట భావోద్వేగాలతో పార్టీలు ప్రచారం ముగించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరికి దెబ్బపడుతుందనేది ఇప్పడు అన్ని పార్టీల్లోనూ కొత్త టెన్షన్ మొదలైంది. మరికాసేపట్లో బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్లు లెక్కిస్తే తేలనుంది.

ఇదిలావుంటే, ప్రచారానికి కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఓటర్లలందరి వద్దకు చేరుకోలేకపోయామని పార్టీల నేతలు చెబుతున్నారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యుహలను ఫ్లాన్ చేసుకునేటప్పటికే ఎన్నికలు వచ్చాయంటున్నారు. పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగేసరికి ప్రచారం గడువు ముగిసింది. ప్రతీ ఓటర్‌ను కలిసి ఓటు అడిగే సమయం దొరకలేదని అభ్యర్థులు, నాయకులు అంటున్నారు.

దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల తర్వాత జరగుతున్న ఎన్నికలు కావడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద సవాల్‌గా స్వీకరించింది. వంద సీట్లు టార్గెట్‌గా మంత్రులను, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్‌ బాధ్యతను అప్పగించింది. గ్రేటర్‌ ప్రచారబాధ్యత తీసుకున్న కేటీఆర్‌ అన్నీ తానై రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సంఘాలతో, వాణిజ్యవర్గాలతో భేటీ అయ్యారు. చివర్లో… నవంబర్‌ 28న జరిగిన సీఎం సభ టీఆర్‌ఎస్‌లో జోష్‌ నింపింది. బీజేపీ కూడా ముఖ్యులకు డివిజన్ల బాధ్యతలు అప్పగించినా… ఎక్కువగా స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారంపైనే ఆధారపడింది.

అయితే అన్ని పార్టీలు చివర్లో ఓటర్ల దగ్గరికి చేరుకోలేక పోయారనే భావన నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌ ఒవైసీలు ప్రచారం నిర్వహించినా… ఎంఐఎం ప్రధానంగా ఎమ్మెల్యేలపై భారం మోపింది. పాతబస్తీలో తమకు తిరుగులేదని నిరూపించేందుకు యత్నించారు. వరదల కారణంగా బస్తీల్లో కొంత వ్యతిరేకత వచ్చినా… అది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించదనే భావనలో మజ్లిస్‌ ఉంది. అయితే, పాతబస్తీలో ఓటింగ్ శాతం తగ్గడంతో ఆ పార్టీలోనూ ఇప్పుడు గుబులు మొదలైంది. ఇక, కాంగ్రెస్‌ పార్టీ ఇళ్లు సర్దుకొని రంగంలోకి దిగేసరికి ప్రచారం ముగింపుకొచ్చింది. పెద్ద నాయకులు విస్తృతంగా తిరగకపోవడం, పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆయా డివిజన్లకు అన్నిపార్టీలు స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా… ఓటింగ్‌ శాతాన్ని పెంచలేకపోయామని మదనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే… తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు.