కరోనా మృతదేహాలకు ఐటీ ఉద్యోగుల ఉచిత సేవలు

కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు. కొవిడ్ సోకిన వ్యక్తులతో బంధాలే తెగిపోతున్నాయి. అయినవారే దగ్గరకు రాకుండా చేస్తున్నాయి. ఇక, కరోనా మరణిస్తే కనికరం లేకుండా పోయింది. అయితే తాము పడ్డ కష్టం ఇతరులెవరు పడకూడదని ఆ మిత్రులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనాతో చనిపోయిన వారిని తరలించి అంతిమ సంస్కారాలు చేసేందుకు ముందుకొచ్చారు.

కరోనా మృతదేహాలకు ఐటీ ఉద్యోగుల ఉచిత సేవలు

Updated on: Jul 17, 2020 | 6:00 PM

కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు. కొవిడ్ సోకిన వ్యక్తులతో బంధాలే తెగిపోతున్నాయి. అయినవారే దగ్గరకు రాకుండా చేస్తున్నాయి. ఇక, కరోనా మరణిస్తే కనికరం లేకుండా పోయింది. అయితే తాము పడ్డ కష్టం ఇతరులెవరు పడకూడదని ఆ మిత్రులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనాతో చనిపోయిన వారిని తరలించి అంతిమ సంస్కారాలు చేసేందుకు ముందుకొచ్చారు.

కరోనా సోకి చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి అంత్యక్రియలు చేయలేని తమ స్నేహితుడు పడిన మానసిక క్షోభ మరెవరూ పడకూడదని భావించిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు వినూత్న అలోచన చేశారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను తీసుకున్నారు. ఇందుకోసం ఒక అంబులెన్స్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి దేహాలను శ్మశాన వాటికకు తరలించడం, దహన సంస్కారాలు నిర్వహించడం వంటివి చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయితేజ, అమన్‌జీత్‌సింగ్‌, తమ స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘ఫీడ్‌ ద నీడ్‌’ పేరుతో వలస కార్మికులకు, పేదవారికి ఆహారం అందించిన వీరు అన్ లాక్‌ అనంతరం ‘సర్వ్‌ ద నీడ్‌’ పేరుతో కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు క్వారంటైన్‌లో ఉండటం వల్ల కరోనా మృతులకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గుర్తించి, సామాజిక బాధ్యతగా సాయం చేస్తున్నామని వారు తెలిపారు. చనిపోయిన వ్యక్తులను సంతోషంగా పంపించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సాయం చేయాలని అనుకున్నామన్నారు. తమ సేవలను ఉపయోగించు కోవాలనుకునేవారు 84998 43545 నెంబర్‌పై సంప్రదించాలని కోరారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కూడా త్వరలో అంబులెన్స్‌ను ప్రారంభించనున్నట్లు టెక్ ఉద్యోగులు తెలిపారు. కరోనాతో చనిపోయినవారి వద్దకు రక్త సంబంధీకులే రానీ సమయంలో వీరు చూపిస్తున్న చొరవపట్ల పలువురు ప్రశంసలు కురిస్తున్నారు.