వేడెక్కిన బెంగాల్ రాజకీయం.. బీజేపీ-టీఎంసీ ఎత్తుకుపైఎత్తులు.. ఎమ్మెల్యే రాజీనామా తిరస్కరణ

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార తృణమూల్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

వేడెక్కిన బెంగాల్ రాజకీయం.. బీజేపీ-టీఎంసీ ఎత్తుకుపైఎత్తులు.. ఎమ్మెల్యే రాజీనామా తిరస్కరణ
Follow us

|

Updated on: Dec 18, 2020 | 6:33 PM

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార తృణమూల్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్‌ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు టీఎంసీ ముఖ్యనేతలను కమల దళంలో కలుపుకునేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన మంత్రి సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. అయితే సువేంద రాజీనామా లేఖను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ తిరస్కరించారు. రాజీనామాను సమర్పించడంలో నిబంధనలు పాటించలేదని, విధానపరమైన లోపాల కారణంగా ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ బిమన్ క్లారిటీ ఇచ్చారు.ఇక ఈరోజు మరో ఎమ్మెల్యే శిల్‌భద్ర దత్తా సహా మైనార్టీ సెల్‌ నాయకుడు కాబిరుల్‌ ఇస్లాం టీఎంసీని వీడారు. 24 గంటల వ్యవధిలో నలుగురు ముఖ్య నేతలు పార్టీ వీడటం టీఎంసీలో కలవరం రేపుతోంది.

గత కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనంపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడింది. దీంతో ఇరువర్గాల మధ్య భౌతిక దాడులు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో విజయమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టిన కమలనాథులు.. తృణమూల్ కాంగ్రెస్‌లోని కీలక నేతలను టార్గెట్ చేశారు

గడిచిన 24 గంటల్లోనే నలుగురు ముఖ్యనేతలు టీఎంసీ పార్టీని వీడటం, రానున్న రోజుల్లో భారీ ఎత్తున క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే టీఎంసీ మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి సహా ఆయన అనుచరుడు, దక్షిణ బెంగాల్‌ రాష్ట్ర రవాణా సంస్థ చీఫ్‌, గ్రీవెన్స్‌ సెల్‌ హెడ్‌ కల్నల్‌ దీప్తాంశు చౌదరి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌కు లేఖ పంపించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ వారంతంలో బెంగాల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వీరంతా ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు, అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ టీం రంగంలోకి దిగింది.

ఓవైపు టీఎంసీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతుండగా.. మరోవైపు బీజేపీ ఆ పార్టీ ముఖ్యనేతలకు గాలం వేస్తూ రోజురోజుకీ బలం పెంచుకుంటోంది. సువేందు అధికారి బీజేపీలో చేరడం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆ అధికారిని చేర్చుకోవడం వల్ల కాషాయ దళానికి కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంపై ఆయనకు పట్టు ఉంది. సుమారు 50 సీట్లలో పార్టీని గెలిపించే సత్తా ఆయనకు ఉందని అంచనా వేస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఈ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ తీరుపై సీఎం మమతా బెనర్జీ ఘాటు స్పందించారు. తమ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారని మండిపడ్డారు. అదే విధంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘‘కొంతమంది అలల్లాగా వస్తారు పోతారు. టీఎంసీ ఉనికిని ఎవరూ ఎన్నటికీ మాయం చేయలేరు’’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, పశ్చిమబెంగాల్‌లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ క్రమంగా పట్టుబిగిస్తోంది. ఎలాగైనా మమత బెనర్జీకి పెట్టని గోడలా ఉన్న పశ్చిమ బెంగాల్ కూల్చడానికి కాషాయదళం సిద్ధమవుతోంది. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.