యూపీఏ హయాంలో తమ పార్టీ అనుసరించిన విధానంపై రైతుల్లో అపోహలు కల్పించే విధంగా బీజేపీ విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ పార్టీ నేత, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నదాతలపట్ల తాము ఎప్పుడూ సానుకూల విధానాన్నే అనుసరించామన్నారు. ముఖ్యంగా కనీస మద్దతుధరపై తాము దృష్టి పెట్టామని, అందులో పేర్కొన్న ధర ఎన్డీయే కొత్త రైతు చట్టాల్లో లేదని అన్నారు. ఒకప్పుడు తాను చైర్మన్ గా ఉన్న కమిటీ ..రైతులు పండించే పంటలకు దగ్గరలోనే కొనుగోలు కేంద్రాలు ఉండాలని సిఫారసు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (2010లో భూపేందర్ హర్యానా సీఎంగా ఉన్నారు). పంట ఉత్పత్తుల రవాణాపై పై గల అన్ని రకాల ఆంక్షలను మేం నాడు ఎత్తివేసాం..అంటూ ఆయన ఇందుకు సంబంధించిన నాటి కాపీని కూడా చూపారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఒకప్పుడు తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాటి ఢిల్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు రాసిలేఖ గురించి గుర్తు చేశారు. మీ రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని సవరించాలని ఆ లేఖలో కోరానని అన్నారు. ఈ సవరణలు అన్నదాతలకు ప్రయోజనం కలిగిస్తాయని సూచించానన్నారు.
రైతుల ఆందోళనను విపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ..సమర్థిస్తూ ‘శోచనీయమైన ద్వంద్వ విధానాలను’ పాటిస్తోందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ఆరోపణపై వీరిలా స్పందించారు.